Under-19 tri-series
-
భళా... యువ భారత్
‘అండర్-19 ముక్కోణపు సిరీస్’ హస్తగతం ఫైనల్లో ఏడు వికెట్లతో బంగ్లాదేశ్‌పై గెలుపు దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ కోల్‌కతా: సర్ఫరాజ్ ఖాన్ (27 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో... అండర్-19 ముక్కోణపు సిరీస్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా 36.5 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ శాంతో (66 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), జోయ్రాజ్ షేక్ (28), జాకీర్ అలీ (24) మినహా మిగతా వారు నిరాశపర్చారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా మిడిల్, లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. మయాంక్ డాగర్ 3, శుభమ్ మావి, మహిపాల్ లోమ్రోర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.3 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లలో వాషింగ్టన్ సుందర్ (12) విఫలమైనా.. రిషబ్ పంత్ (16 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అమన్‌దీప్ కారె (0) నిరాశపర్చడంతో ఓ దశలో భారత్ 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ రికీ భుయ్ (20 బంతుల్లో 20 నాటౌట్; 4 ఫోర్లు), సర్ఫరాజ్ చెలరేగి ఆడారు. పసలేని బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెట్టిన సర్ఫరాజ్.. నాలుగో వికెట్‌కు కేవలం ఏడు ఓవర్లలోనే అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... నిలకడగా ఆడిన రిషబ్ పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన భారత జట్టు ఈ టోర్నమెంట్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. -
ఫైనల్లో యువ భారత్
రాణించిన సుందర్, పంత్ * అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుందర్ వాషింగ్టన్ (75 బంతుల్లో 50; 6 ఫోర్లు; 2/25) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు చేసింది. హసన్ మిరాజ్ (90 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. సైఫ్ హసన్ (33), సైఫుద్దీన్ (30) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి నెగ్గింది. రిషబ్ పంత్ (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అమన్‌దీప్ (41), ఇషాన్ కిషన్ (24), విరాట్ సింగ్ (21) తలా కొన్ని పరుగులు జత చేశారు. పంత్, ఇషాన్‌లు 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి ఓ దశలో భారత్ 116 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ దశలో సుందర్, అమన్‌దీప్ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. -
గాజి మాయాజాలం
* అఫ్ఘాన్‌పై బంగ్లా గెలుపు * అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: స్పిన్నర్ సలే అహ్మద్ షాన్ గాజి (7.4-2-10-6) మాయాజాలానికి అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో అఫ్ఘానిస్తాన్ విలవిలలాడింది. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌పై విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ 30.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. హజ్రతుల్లా (32), ఇసానుల్లా (14) ఓ మాదిరిగా ఆడినా.. మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఆరో ఓవర్లోనే స్పిన్నర్‌ను తేవడంతో అఫ్ఘాన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో 8 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హసన్ మిరాజ్ 2, సయీద్ సర్కార్ ఒక్క వికెట్ తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 6 వికెట్లకు 89 పరుగులు చేసి నెగ్గింది. సైఫ్ హసన్ (32) టాప్ స్కోరర్. నజ్ముల్ హుస్సేన్ (19), జాకిర్ హసన్ (13) ఫర్వాలేదనిపించారు. జియావుర్, కరీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది.