సరితపై ఏడాది నిషేధం
కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్లు
జీఎస్ సంధూకు మినహాయింపు
ఏఐబీఏ నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2014 అక్టోబర్ 1 నుంచి 2015 అక్టోబర్ 1 వరకు అమల్లోకి ఉంటుంది. తీవ్రమైన చర్యలు తప్పవని మొదట్లో సంకేతాలు వచ్చినా... నిషేధం తక్కువగా ఉండటంతో సరితా దేవి బాక్సింగ్ కెరీర్‌కు పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్న ఆమె ఒలింపిక్స్ అర్హత టోర్నీ అయిన 2016 మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో ఉండనుంది. ‘ఏఐబీఏ నిర్ణయం నాకు ఊరటనిచ్చింది.
కష్టకాలంలో నాకు అండగా నిలిచిన బాక్సింగ్ ఇండియా, కేంద్ర క్రీడల మంత్రికి, సచిన్ టెండూల్కర్‌కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. కాబట్టి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరింత కష్టపడతా’ అని సరిత పేర్కొంది. ఈ సంఘటనలో జాతీయ కోచ్ గురుబక్ష్ (జీఎస్) సింగ్ సంధూ, సాగర్ మైదయాల్‌ల తప్పులేదని ఏఐబీఏ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. అయితే భారత్‌కు పని చేస్తున్న విదేశీ కోచ్ బ్లాస్ ఇగ్లేసియాస్ ఫెర్నాండెజ్‌ను మాత్రం కఠినంగా శిక్షించింది. ఆయనపై రెండేళ్ల నిషేధంతో పాటు 2 వేల స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా విధించింది.
2014 అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. సరితా వ్యక్తిగత కోచ్ లెనిన్ మిటెటీపై ఏడాది, బౌట్ సందర్భంగా అనధికారికంగా రింగ్‌లో ఉన్నందుకు బాక్సర్ భర్త తొయిబా సింగ్‌పై రెండేళ్ల సస్పెన్షన్ విధించింది. సరితపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తాజాగా ఏఐబీఏకు లేఖ రాస్తామన్నారు.