సతీశ్ యాదవ్‌కు కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడోత్సవాల్లో భాగంగా వరంగల్‌లో జరిగిన జూడో టోర్నమెంట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసు విభాగానికి చెందిన సతీశ్ లాల్ యాదవ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల 73 కేజీల విభాగంలో సతీశ్ మూడో స్థానంలో నిలిచాడు. సతీశ్‌తోపాటు నిజామాబాద్‌కు చెందిన నరేందర్‌కు కాంస్యం లభించింది. హరికృష్ణ (డబ్ల్యూసీపీ), జె. వెంకటేశ్ (టీఎస్‌ఎస్‌పీ) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో కె.నీలిమ (హైదరాబాద్ సిటీ) స్వర్ణం నెగ్గగా... 52 కేజీల విభాగంలో భాగ్యలక్ష్మి (హైదరాబాద్ సిటీ) రజతం సాధించింది. పురుషుల 60 కేజీల విభాగంలో కె. ప్రశాంత్ (హైదరాబాద్ రేంజ్), ఎ. గణేశ్ (హైదరాబాద్ సిటీ) స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. విజేతలకు వరంగల్ సిటీ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, కలెక్టర్ అమ్రపాలి పతకాలను, సర్టిఫికెట్‌లను అందజేశారు.