సుప్రీంకోర్టును కోరిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని బీసీసీఐ మంగళవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నో ఊహాగానాలకు తావిస్తున్న నివేదికను బయటపెట్టాలని తమను కోరడం తప్పే అయినప్పటికీ అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పుతాయని బోర్డు తరఫు న్యాయవాది వాదించారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణలో న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నామని జస్టిస్ టీఎస్ ఠాకూర్, మొహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాతో కూడిన బెంచ్ వెల్లడించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేసింది. చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ ‘ఇన్‌సైడ్ ట్రేడింగ్’కు పాల్పడ్డాడని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
గురు సమాచారాన్ని లీక్ చేస్తే మరొకరు బెట్ కాసేవారని వివరించింది. మరోవైపు మొదట 1, 2 ఆటగాళ్ల పేర్లను బహిర్గతం చేయాలని కోరిన బీహార్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆ తర్వాత మొత్తం నివేదికను బయటకు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.