IPL spot-fixing
-
హైకోర్టులో ఢిల్లీ పోలీసుల అప్పీల్
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిందితులను ఆధారాలు లేవనే కారణంతో ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఢిల్లీ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్ సహా 36 మంది జూలై 24న ఈ కేసు నుంచి విముక్తులైన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 38 అంశాలను పేర్కొన్నారు. మోకా చట్టాన్ని కోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే తీర్పునిచ్చిందని తెలిపారు. -
నిషేధం
చెన్నై, రాజస్తాన్‌లపై రెండేళ్లు కుంద్రా, మెయ్యప్పన్లపై జీవితకాలం భారత క్రికెట్లో పెను సంచలనం. రెండేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న కేసులో జస్టిస్ లోధా కమిటీ తీర్పు వెల్లడించింది. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రాజ్ కుంద్రా, గురునాథ్ మెయ్యప్పన్‌లను జీవితకాలం క్రికెట్ కార్యకలాపాల నుంచి బహిష్కరించింది. క్రికెట్‌పై అభిమానుల్లో ఏర్పడిన అనుమానాలు తమ తీర్పు ద్వారా తొలగిపోతాయని లోథా కమిటీ పేర్కొంది. అటు బీసీసీఐ మరో రెండు కొత్త జట్లను చేర్చాలనే ఆలోచనలో ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా ఆటగాళ్లకు నష్టం జరగకుండా బోర్డు జాగ్రత్తపడనుంది. న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కు జస్టిస్ లోధా కమిటీ గట్టి షాకే ఇచ్చింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల లోధా కమిటీ మంగళవారం ఈ విషయాలను వెల్లడించింది. అలాగే బెట్టింగ్‌కు పాల్పడినందుకు చెన్నై జట్టు టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్తాన్ సహ యజమాని రాజ్ కుంద్రాలను దోషులుగా నిర్ధారించింది. వారు అవినీ తికి పాల్పడినట్టు ఆధారాలున్నాయని ప్రకటించింది. ఇక భవిష్యత్‌లో వీరిద్దరు ఎలాంటి క్రికెట్ కార్యకలాపా లు చేపట్టకుండా జీవిత కాల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆటగాళ్లకన్నా.. ఆదాయం కన్నా.. క్రికెట్ స్ఫూర్తి ముఖ్యమంటూ లోధా కమిటీ స్పష్టం చేసింది. క్రికెట్ స్వచ్ఛతను కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ జనవరిలో ఐపీఎల్‌లోని చెన్నై, రాజస్తాన్ జట్లతో పాటు గురునాథ్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారంపై తీర్పునిచ్చేందుకు సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలావుండగా ఈ తీర్పును సవాల్ చేసేందుకు ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇండియా సిమెంట్స్, కుంద్రా వాదనలను తోసిపుచ్చిన కమిటీ మరోవైపు క్రికెట్ అభివృద్ధికి తామెంతగానో కృషి చేశామని ఇండియా సిమెంట్స్ చేసిన వాదనలను కమిటీ తోసిపుచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న గురునాథ్‌పై చర్యలు తీసుకోలేదని వారికి గుర్తు చేసింది. అలాగే చిన్న స్థాయి ఆటగాళ్లకు తాము పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చామని రాజస్తాన్ ఫ్రాంచైజీ వాదించింది. అయితే జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు బెట్టింగ్‌లో ఇరుక్కు న్నారని, తమ టీమ్‌ను నడపడంలో ఎక్కడో వైఫల్యమున్నట్టు కమిటీ తెలిపింది. రాజ్ కుంద్రా బెట్టింగ్ కూడా బీసీసీఐ, ఐపీఎల్‌కు అపఖ్యాతి తెచ్చిందని పేర్కొంది. ‘మెయ్యప్పన్ 60 లక్షలు పోగొట్టుకున్నాడు’ మెయ్యప్పన్ అవినీతి వ్యవతిరేక కోడ్, ఐపీఎల్ నిబంధనలను పూర్తిగా విస్మరించాడని కమిటీ చెప్పింది. ‘గురునాథ్కున్న భారీ బెట్టింగ్ అలవాటు కారణంగా రూ.60 లక్షల దాకా నష్టపోయాడు. అతడి వయస్సు 40. బెట్టింగ్ చేస్తే చెడ్డపేరు వస్తుందనే విషయం తెలియదని ఆయన చెబితే నమ్మలేం. తను, కుంద్రా చేసిన పని భారత క్రికెట్‌కు పెద్ద దెబ్బగానే భావిం చాలి’ అని కమిటీ పేర్కొంది. వీరిద్దరిపై ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో తామేమీ చెప్పలేమని, అది తమ పరిధిలోకి రాదని తేల్చింది. ‘విశ్వసనీయత దెబ్బతింది’ ఈ మొత్తం వ్యవహారం కారణంగా దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆటపై విశ్వసనీయత దెబ్బతిందని లోధా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తాము చూస్తున్నది నిజమైన ఆటేనా.. కాదా? అనే అపనమ్మకం అందరిలోనూ ఏర్పడిందని జస్టిస్ లోధా అన్నారు. ‘అవినీతి వ్యతిరేక కోడ్ ఆర్టికల్ 2.2.1 ప్రకారం గురునాథ్, రాజ్ కుంద్రాలను ఐదేళ్ల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అలాగే ఆర్టికల్ 7.5 లెవల్ 4 ప్రకారం క్రికెట్ నుంచి జీవిత కాల నిషేధం విధిస్తున్నాం. నిబంధన 4.2, సెక్షన్ 6 ప్రకారం ఏ రకమైన క్రికెట్ మ్యాచ్‌ల్లోనూ భాగస్వామ్యం కాకుండా జీవిత కాల నిషేధం విధిస్తున్నాం. ఈ ఆంక్షలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయి’ - లోధా కమిటీ లోధా కమిటీ ఇచ్చిన తీర్పుతో షాక్‌కు గురయ్యాను. ఇందులో చాలా దోషాలున్నాయి. జడ్జిమెంట్ కాపీ కోసం విజ్ఞప్తి చేశాను. ఇది నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. - ట్విట్టర్లో కుంద్రా తీర్పును మేం ఇప్పటిదాకా చూడలేదు. మా న్యాయ సలహాదారులతో చర్చించాక ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. మా జట్టును పూర్తిగా రద్దు చేయలేదు. రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి వస్తాం. అయితే మాపై ఏదో ఒక చర్య ఉంటుందని భావించాం. - చెన్నై సూపర్‌కింగ్స్ అధికారి. కమిటీ తీర్పును బీసీసీఐ గౌరవిస్తోంది. పూర్తి నివేదిక చదివాక మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. మచ్చలేని క్రికెట్ కోసమే మేం పాటుపడుతున్నాం. - దాల్మియా (బీసీసీఐ అధ్యక్షుడు) అసలేం జరిగిందంటే... ♦ భారత క్రికెట్‌ను కుదిపేసిన ఈ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం 2013 సీజన్లో బయటపడింది. రాజస్తాన్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో కలకలం ప్రారంభమైంది. చెన్నై టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్, రాజస్తాన్ సహ యజమాని కుంద్రా కూడా బెట్టింగ్‌లో భాగస్వామ్యులే అని తేలింది. ♦ అదే ఏడాది మే 24న పోలీసులు గురునాథ్‌ను అరెస్ట్ చేశారు. కానీ ఐపీఎల్ పాలక మండలి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ గురునాథ్, కుంద్రాలకు క్లీన్చిట్ ఇచ్చింది. దీన్ని ప్రశ్నిస్తూ బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ♦ బీసీసీఐ ప్యానెల్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై బోర్డు సుప్రీం కెళ్లగా శ్రీనివాసన్, బీసీసీఐ, ఇండియా సిమెంట్స్, రాజస్తాన్‌లకు నోటీసులిచ్చింది. ♦ అక్టోబర్‌లో ఈ స్కాండల్‌ను 4 నెలల్లో పరిశోధించాలంటూ సుప్రీం కోర్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ గురునాథ్, కుంద్రాలను దోషులుగా పేర్కొంటూ పలువురు ఆటగాళ్లు, అధికారుల పేర్లతో సీల్డ్ కవర్‌ను కోర్టుకు అప్పగించింది. ఇక ఈ జనవరిలో జస్టిస్ లోధా ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని తుది తీర్పు కోసం సుప్రీం ఏర్పాటు చేసింది. ఆటగాళ్లకు నష్టం లేదు లోధా కమిటీ ఇచ్చిన తీర్పు తర్వాత ఐపీఎల్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే ఆందోళన పెరిగింది. ఇదే సమయంలో ఈ రెండు జట్లలోని స్టార్ క్రికెటర్ల సంగతేంటనే చర్చా మొదలైంది. ఎవరెవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఆటగాళ్లు: రాజస్తాన్, చెన్నై జట్లలో ధోని సహా పలువురు స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఆటగాళ్ల మీద తమ తీర్పు ప్రభావం ఉండదని, వారు ఇతర జట్లలో ఆడుకోవచ్చని కమిటీ పేర్కొంది. కాబట్టి ఆటగాళ్లకు నష్టం లేదు. వచ్చే సీజన్ ఐపీఎల్: బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం బిడ్డింగ్‌లను ఆహ్వానించే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రెండు జట్ల స్థానంలో మరో రెండు జట్లు వస్తాయి. ఐపీఎల్లో ఒక్కో సీజన్లో 10 జట్ల వరకు ఆడే ప్రొవిజన్ ఉంది. ఆరు జట్లతో ఐపీఎల్‌ను నిర్వహిస్తే బోర్డుకు ఆర్థికంగా చాలా నష్టం. కాబట్టి వీలైనంత త్వరలో రెండు కొత్త జట్లను ఏర్పాటు చేయొచ్చు. ఈ విషయాలను చర్చించేందుకు ఈనెల 19న పాలక మండలి సమావేశం కానుంది. ఆటగాళ్ల వేలం: రెండు కొత్త జట్లు వస్తే మళ్లీ వేలం నిర్వహించాల్సి రావచ్చు. ఈ రెండు జట్లలో కలిపి సుమారు 45 మంది క్రికెటర్లు ఉన్నారు. వీరి వరకే వేలం అంటే కొత్త ఫ్రాంచైజీలు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి మళ్లీ మొత్తం క్రికెటర్లందరినీ వేలంలోకి తేవడం ఒక ప్రత్యామ్నాయం. శ్రీనివాసన్ పరిస్థితి: ప్రస్తుతం ఆయన ఐసీసీ చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయన తప్పు లేకపోయినా... ఆయన అల్లుడు మెయ్యప్పన్ పాత్ర ఉంది కాబట్టి నైతిక విలువలను దృష్టిలో ఉంచుకుని ఆయన తప్పుకోవచ్చు. లేదంటే సెప్టెంబరులో బీసీసీఐ తప్పించే అవకాశం ఉంది. సుందర్ రామన్ పరిస్థితి: ఐపీఎల్ సీఓఓపై మరింత విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. కాబట్టి ఆయనపై విచారణ పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగుతారు. చెన్నై, రాజస్తాన్ ఏం చేయొచ్చంటే: లోధా కమిటీ నిర్ణయాన్ని ఈ రెండు ఫ్రాంచైజీలు కోర్టులో సవాల్ చేయొచ్చు. అదే సమయంలో ఈ జట్లను కొత్తవాళ్లకు అమ్మే ప్రయత్నం కూడా చేయొచ్చు. యజమానులు మారితే కొత్త పేర్లతో ఈ జట్లు బరిలోకి దిగొచ్చు. కుంద్రా, మెయ్యప్పన్ల పరిస్థితి: ఫ్రాంచైజీల తరహాలోనే వ్యక్తులుగా వీళ్లు కూడా ఈ తీర్పును సవాల్ చేయొచ్చు. తొలుత ముద్గల్ కమిటీ విచారణలో ఈ ఇద్దరినీ జట్టు అధికారులుగానే పేర్కొన్నారు. కాబట్టి తిరిగి కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవచ్చు. కాబట్టి జీవితకాలం క్రికెట్‌కు దూరం కావాల్సిందే. -
నా పేరు లాగుతూనే ఉంటారు!
సిడ్నీ: ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం వెలుగు చూసిన నాటినుంచి ఒక్కసారి కూడా నోరు తెరవని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ఎట్టకేలకు పెదవి విప్పాడు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తనదైన శైలిలో అతను వ్యాఖ్య చేశాడు. అయితే అదేదో నిజానిజాల గురించి కాకుండా తన మనసులో భావాన్ని మాత్రం వెల్లడించాడు. కోర్టు తీర్పుతో సాంత్వన కలిగిందా అనే ప్రశ్నకు స్పందిస్తూ భారత కెప్టెన్ ఈ మాటలు అన్నాడు. విచారణ సందర్భంగా ధోనిని కూడా ముద్గల్ కమిటీ ప్రశ్నించగా... పలు సందర్భాల్లో ధోని పేరు చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఒక విషయం మాత్రం స్పష్టం. వాస్తవాలు ఎలా ఉన్నా భారత క్రికెట్‌కు సంబంధించి నా పేరు ఎగుస్తూనే ఉంటుంది. ఇప్పుడొక అంకం ముగిసింది. రేపు రెండు రోజుల్లో మరొక వివాదంలో నన్ను లాగుతారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీనికి అలవాటు పడిపోయా. అసలు ఏమీ లేని చోట ఊహాగానాలకు తెర తీస్తారు. చిన్నదో, పెద్దదో ఒక కథను అల్లుతారు. మీరు మళ్లీ దానిపై పడతారు. నేను వీటన్నింటిని భరించాల్సిందే’ అని ధోని వ్యాఖ్యానించాడు. విచారణ జరిగే సమయంలో వివాదానికి ధోని పేరును జోడిస్తూ పెద్ద సంఖ్యలో కథనాలు వచ్చాయి. సుప్రీంకోర్టును ఇచ్చిన జాబితాలో అతని పేరుందని కూడా వినిపించింది. అయితే వాటిని ఏనాడు ఖండించే ప్రయత్నం చేయలేదు. వివాదం రేపిన కోహ్లి ట్వీట్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి శనివారం ‘ట్విట్టర్’లో వ్యాఖ్యతో ఒక్కసారిగా సంచలనానికి కేంద్రంగా నిలిచాడు. ఫిక్సింగ్ అంశంపై కొత్త అనుమానాలు రేకెత్తేలా వ్యవహరించాడు. ‘ముద్గల్ కమిటీ నివేదికలో నంబర్ 2 ధోనినా’ అంటూ నెలన్నర క్రితం ఒక ఆంగ్ల వార్తా పత్రికలో కథనం వచ్చింది. శనివారం కోహ్లి ఆ కథనాన్ని రీట్వీట్ చేస్తూ దాని లింక్ కూడా ఇచ్చాడు. అంతే కాదు...దానిని తన ఫేవరెట్ ట్వీట్లలో ఒకటిగా కూడా పెట్టుకున్నాడు. రీట్వీట్ చేయడం అంటే ఓ రకంగా ఆ కథనాన్ని సమర్థించినట్లే! దీంతో ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టింది. దాంతో నష్టనివారణ చేస్తూ కోహ్లి ఆ ట్వీట్‌ను తొలగించాడు. -
ముద్గల్ నివేదికను బయటపెట్టండి!
సుప్రీంకోర్టును కోరిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని బీసీసీఐ మంగళవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నో ఊహాగానాలకు తావిస్తున్న నివేదికను బయటపెట్టాలని తమను కోరడం తప్పే అయినప్పటికీ అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పుతాయని బోర్డు తరఫు న్యాయవాది వాదించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణలో న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నామని జస్టిస్ టీఎస్ ఠాకూర్, మొహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాతో కూడిన బెంచ్ వెల్లడించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేసింది. చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ ‘ఇన్సైడ్ ట్రేడింగ్’కు పాల్పడ్డాడని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గురు సమాచారాన్ని లీక్ చేస్తే మరొకరు బెట్ కాసేవారని వివరించింది. మరోవైపు మొదట 1, 2 ఆటగాళ్ల పేర్లను బహిర్గతం చేయాలని కోరిన బీహార్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆ తర్వాత మొత్తం నివేదికను బయటకు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. -
ధోని స్నేహితుడిని కూడా..
విచారించిన ముద్గల్ కమిటీ ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై విచారణ సాగిస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ నివేదికకు తుది రూపునిస్తోంది. ఈ వారాంతంలో కమిటీ ఆ నివేదికను సుప్రీం కోర్టుకు అందించాల్సి ఉంది. దీంట్లో భాగంగా మాజీ క్రీడా ప్రచారకర్త ఆషిమ్ ఖేతర్పాల్, కెప్టెన్ ధోని ఎండార్స్మెంట్ చూసే అతడి స్నేహితుడు అరుణ్ పాండేలను కమిటీ ప్రశ్నించింది. ‘ధోనితో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఎంత మొత్తాన్ని అతడికి ఆఫర్ చేశారు? ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? అని పాండేను కమిటీ ప్రశ్నించింది. అలాగే ధోనితో వ్యాపార సంబంధాల గురించి కూడా ఆరా తీశారు. పాండేకు చెందిన రితీ స్పోర్ట్స్‌లో ధోనికి వాటాలున్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఎన్ని కంపెనీలకు ధోని ఎండార్స్ చేస్తున్నాడు.. ఆ కంపెనీలు నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయా అని ప్రశ్నించారు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు అరుణ్ పాండే నిరాకరించారు. మరోవైపు పాండేతో సంబంధాల గురించి తనను కమిటీ ప్రశ్నించిందని ఖేతర్పాల్ తెలిపారు. గతంలో మ్యాచ్‌లు ఫిక్స్ చేసేందుకు పలువురు క్రికెటర్లకు డబ్బులు ఆఫర్ చేశారనే ఆరోపణలు ఖేతర్పాల్పై ఉన్నాయి. -
పదవి నుంచి తప్పుకోనున్న శ్రీనివాసన్!
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన పట్టు వీడనున్నట్లు కనబడుతుంది. సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్‌కు సూచించడంతో ఆయన గురువారం పలువురు న్యాయవాదులను కలసి సలహా సంప్రదింపులు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే త్వరలో ఐసీసీ పీఠం అధిష్టించవచ్చా లేక ఏమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నయా అంటూ ఆయన తన తరపు న్యాయవాదులతో శ్రీనివాసన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు విధించిన గడువు రెండు రోజులు నేటితో ముగియనున్న నేపథ్యంలో శ్రీనివాసన్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రెండు రోజుల్లో తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. ఐపీఎల్ జట్టు అవినీతి వ్యవహారాలలో శ్రీనివాసన్ అల్లుడు ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతం జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రెండు రోజులలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్‌కు సూచించింది. లేకుంటే తామే జోక్యం చేసుకుని అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
శ్రీనివాసన్‌కు మళ్లీ నిరాశ.. సుప్రీం కోర్టు షరతు
బీసీసీఐ అధ్యక్ష పదవిని మళ్లీ అధిష్టించాలని ఆశిస్తున్న ఎన్.శ్రీనివాసన్‌కు కాస్త ఉపశమనం కలిగినా నిరీక్షణ మాత్రం తప్పలేదు. ఈ నెల 29న జరిగే బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశానికి, అధ్యక్ష పదవి ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నయ్‌లో జరిగే ఈ సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అనుమతిచ్చింది. ఐతే బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మరోసారి ఎన్నికయినా బాధ్యతలు చేపట్టరాదని ఆదేశించింది. బీసీసీఐ ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ బీహార్ క్రికెట్ సంఘం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్ అల్లుడు, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ టీమ్ ప్రిన్సిపాల్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ దశలో ఉండటంతో పాటు బోర్డు అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ తాత్కలికంగా వైదొలగిన విషయాలను బీహార్ సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ కేసులో తాము తీర్పు వెలువరించే వరకు శ్రీనివాసన్ బోర్డు పదవికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా బోర్డు పగ్గాలు చేపట్టేందుకు శ్రీనివాసన్ వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. -
ఐపీఎల్ స్పాట్ ఫీక్సింగ్ కేసు
-
ఫిక్సింగ్ ఆటగాళ్లపై బీసీసీఐ అయిదేళ్ల వేటు!
ముంబయి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నలుగురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు దోషులుగా తేలారు. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చవాన్ ఫిక్సింగ్ పాల్పడినట్లు బీసీసీఐ దర్యాప్తు కమిటీ నిర్దారించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌ల వ్యవహారంపై రవి సవానీ నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ విచారణ జరిపింది. కమిటీ విచారణలో నలుగురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ మేరకు దర్యాప్తు నివేదిక సమర్పించిన కమిటీ... ఆ నలుగురిపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని సూచించింది. కాగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా భవితవ్యంపై నేడు బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ ముగ్గురి వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ గత నెలలో బోర్డు వర్కింగ్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నేడు సమావేశం అవుతోంది. అరుణ్ జైట్లీ, నిరంజన్ షా నేతృత్వంలోని ఈ కమిటీ వీరి గురించి చర్చించనుంది. తదనంతరం తమ అభిప్రాయాలను ఈనెల 29న జరిగే వార్షిక సమావేశం ముందుంచుతారు. ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ అయిన ఈ త్రయం ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఫిక్సింగ్ వ్యవహారం బయటపడగానే ఈ ముగ్గురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రాజస్థాన్ జట్టు ఉపసంహరించుకుంది. -
స్పాట్ లింకులు