నా పేరు లాగుతూనే ఉంటారు!
సిడ్నీ: ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం వెలుగు చూసిన నాటినుంచి ఒక్కసారి కూడా నోరు తెరవని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ఎట్టకేలకు పెదవి విప్పాడు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తనదైన శైలిలో అతను వ్యాఖ్య చేశాడు. అయితే అదేదో నిజానిజాల గురించి కాకుండా తన మనసులో భావాన్ని మాత్రం వెల్లడించాడు. కోర్టు తీర్పుతో సాంత్వన కలిగిందా అనే ప్రశ్నకు స్పందిస్తూ భారత కెప్టెన్ ఈ మాటలు అన్నాడు. విచారణ సందర్భంగా ధోనిని కూడా ముద్గల్ కమిటీ ప్రశ్నించగా... పలు సందర్భాల్లో ధోని పేరు చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఒక విషయం మాత్రం స్పష్టం.
వాస్తవాలు ఎలా ఉన్నా భారత క్రికెట్‌కు సంబంధించి నా పేరు ఎగుస్తూనే ఉంటుంది. ఇప్పుడొక అంకం ముగిసింది. రేపు రెండు రోజుల్లో మరొక వివాదంలో నన్ను లాగుతారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీనికి అలవాటు పడిపోయా. అసలు ఏమీ లేని చోట ఊహాగానాలకు తెర తీస్తారు. చిన్నదో, పెద్దదో ఒక కథను అల్లుతారు. మీరు మళ్లీ దానిపై పడతారు. నేను వీటన్నింటిని భరించాల్సిందే’ అని ధోని వ్యాఖ్యానించాడు. విచారణ జరిగే సమయంలో వివాదానికి ధోని పేరును జోడిస్తూ పెద్ద సంఖ్యలో కథనాలు వచ్చాయి. సుప్రీంకోర్టును ఇచ్చిన జాబితాలో అతని పేరుందని కూడా వినిపించింది. అయితే వాటిని ఏనాడు ఖండించే ప్రయత్నం చేయలేదు.
వివాదం రేపిన కోహ్లి ట్వీట్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి శనివారం ‘ట్విట్టర్’లో వ్యాఖ్యతో ఒక్కసారిగా సంచలనానికి కేంద్రంగా నిలిచాడు. ఫిక్సింగ్ అంశంపై కొత్త అనుమానాలు రేకెత్తేలా వ్యవహరించాడు. ‘ముద్గల్ కమిటీ నివేదికలో నంబర్ 2 ధోనినా’ అంటూ నెలన్నర క్రితం ఒక ఆంగ్ల వార్తా పత్రికలో కథనం వచ్చింది. శనివారం కోహ్లి ఆ కథనాన్ని రీట్వీట్ చేస్తూ దాని లింక్ కూడా ఇచ్చాడు. అంతే కాదు...దానిని తన ఫేవరెట్ ట్వీట్లలో ఒకటిగా కూడా పెట్టుకున్నాడు. రీట్వీట్ చేయడం అంటే ఓ రకంగా ఆ కథనాన్ని సమర్థించినట్లే! దీంతో ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టింది. దాంతో నష్టనివారణ చేస్తూ కోహ్లి ఆ ట్వీట్‌ను తొలగించాడు.