‘సిక్సర్‌’ కొట్టేదెవరో? | Mumbai Indians and Chennai Super Kings in race for sixth title | Sakshi
Sakshi News home page

‘సిక్సర్‌’ కొట్టేదెవరో?

Published Wed, Mar 19 2025 3:52 AM | Last Updated on Wed, Mar 19 2025 3:56 AM

Mumbai Indians and Chennai Super Kings in race for sixth title

ఆరో టైటిల్‌ వేటలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌

మరో 3 రోజుల్లో ఐపీఎల్‌

ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్‌ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్‌ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్‌ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 

అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్‌ గడిచిపోగా... 2024 ఐపీఎల్‌ తర్వాత భారత జట్టుకు రోహిత్‌ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్‌ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్‌ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్‌లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్‌కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్‌లో చెన్నై  జోరు ఏంటో చెప్పేందుకు. 

వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్‌ రవీంద్ర బ్యాటింగ్‌ సామర్థ్యం... శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్‌ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌... ఆరో కప్పువేటకు సిద్ధమైంది.  –సాక్షి క్రీడావిభాగం  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్‌ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్‌లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్‌ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్‌ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మను కాదని... గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. 

దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్‌ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్‌ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్‌ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. 

గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్‌ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు, చాంపియన్స్‌ ట్రోఫీ చేజిక్కించుకుంది. 

ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్‌ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్‌ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. 

బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించేనా! 
ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్‌ పేసర్‌... ఐపీఎల్‌ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్‌తో పాటు హైదరాబాదీ ప్లేయర్‌ తిలక్‌ వర్మను ఫ్రాంచైజీ రిటైన్‌ చేసుకుంది. 

అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్‌ బౌల్ట్, దీపక్‌ చాహర్, సాంట్నర్‌తో బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్‌తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్‌ రికెల్టన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్‌... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల విదేశీ పించ్‌ హిట్టర్‌ లోటు కనిపిస్తోంది. 

రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్‌ టు మ్యాచ్‌’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్‌ ధీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్‌ చాహర్, కరణ్‌ శర్మ పై బౌలింగ్‌ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కడం కష్టమే. 

ముంబై ఇండియన్స్‌ జట్టు: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్‌ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్‌ క్రిష్ణన్, జాకబ్స్, నమన్‌ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్‌ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్‌ శర్మ, దీపక్‌ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్‌ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. 

అంచనా: ముంబై ఇండియన్స్‌ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్‌ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్‌ సైతం... ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌గా మారడం... చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో నిత్యకృత్యం.

అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్‌ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్‌ కింగ్స్‌ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌గా నిలిచింది. గతేడాదే రుతురాజ్‌ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.

పతిరణను రూ. 13 కోట్లు, శివమ్‌ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్‌ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్‌ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్‌ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్‌ టు మ్యాచ్‌’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్‌ కింగ్స్‌ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.  

తలా... అన్నీ తానై! 
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్‌ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్‌కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్‌ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. 

బ్యాటింగ్‌లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్‌ అహ్మద్, స్యామ్‌ కరన్‌ బౌలింగ్‌ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్‌ హూడా, విజయ్‌ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్‌ కరన్‌ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్‌రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. 

చెన్నై జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్ ), మహేంద్రసింగ్‌ ధోని, కాన్వే, రాహుల్‌ త్రిపాఠి, షేక్‌ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్‌్థ, రచిన్‌ రవీంద్ర, రవిచంద్రన్‌ అశ్విన్, విజయ్‌ శంకర్, స్యామ్‌ కరన్, అన్షుల్‌ కంబోజ్, దీపక్‌ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్‌ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, ఖలీల్‌ అహ్మద్, నూర్‌ అహ్మద్, ముకేశ్, గుర్‌జప్నీత్‌ సింగ్, నాథన్‌ ఎలీస్, శ్రేయస్‌ గోపాల్, పతిరణ. 

అంచనా: ఐపీఎల్‌లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్‌ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement