నిషేధం | BCCI to Committee on Justice Lodha gave stiff shock | Sakshi
Sakshi News home page

నిషేధం

Published Wed, Jul 15 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

నిషేధం

నిషేధం

చెన్నై, రాజస్తాన్‌లపై రెండేళ్లు
కుంద్రా, మెయ్యప్పన్‌లపై జీవితకాలం

భారత క్రికెట్‌లో పెను సంచలనం. రెండేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న కేసులో జస్టిస్ లోధా కమిటీ తీర్పు వెల్లడించింది. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రాజ్ కుంద్రా, గురునాథ్ మెయ్యప్పన్‌లను జీవితకాలం క్రికెట్ కార్యకలాపాల నుంచి  బహిష్కరించింది. క్రికెట్‌పై అభిమానుల్లో ఏర్పడిన అనుమానాలు తమ తీర్పు ద్వారా తొలగిపోతాయని  లోథా కమిటీ పేర్కొంది. అటు బీసీసీఐ మరో రెండు కొత్త జట్లను చేర్చాలనే ఆలోచనలో ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా ఆటగాళ్లకు నష్టం జరగకుండా బోర్డు జాగ్రత్తపడనుంది.

 
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కు జస్టిస్ లోధా కమిటీ గట్టి షాకే ఇచ్చింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల లోధా కమిటీ మంగళవారం ఈ విషయాలను వెల్లడించింది.

అలాగే బెట్టింగ్‌కు పాల్పడినందుకు చెన్నై జట్టు టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్తాన్ సహ యజమాని రాజ్ కుంద్రాలను దోషులుగా నిర్ధారించింది. వారు అవినీ తికి పాల్పడినట్టు ఆధారాలున్నాయని ప్రకటించింది. ఇక భవిష్యత్‌లో వీరిద్దరు ఎలాంటి క్రికెట్ కార్యకలాపా లు చేపట్టకుండా జీవిత కాల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆటగాళ్లకన్నా.. ఆదాయం కన్నా.. క్రికెట్ స్ఫూర్తి ముఖ్యమంటూ లోధా కమిటీ స్పష్టం చేసింది. క్రికెట్ స్వచ్ఛతను కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ జనవరిలో ఐపీఎల్‌లోని చెన్నై, రాజస్తాన్ జట్లతో పాటు గురునాథ్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారంపై తీర్పునిచ్చేందుకు సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలావుండగా ఈ తీర్పును సవాల్ చేసేందుకు ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
 
ఇండియా సిమెంట్స్, కుంద్రా వాదనలను తోసిపుచ్చిన కమిటీ
మరోవైపు క్రికెట్ అభివృద్ధికి తామెంతగానో కృషి చేశామని ఇండియా సిమెంట్స్ చేసిన వాదనలను కమిటీ తోసిపుచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న గురునాథ్‌పై చర్యలు తీసుకోలేదని వారికి గుర్తు చేసింది. అలాగే చిన్న స్థాయి ఆటగాళ్లకు తాము పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చామని రాజస్తాన్ ఫ్రాంచైజీ వాదించింది. అయితే జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు బెట్టింగ్‌లో ఇరుక్కు న్నారని, తమ టీమ్‌ను నడపడంలో ఎక్కడో వైఫల్యమున్నట్టు కమిటీ తెలిపింది. రాజ్ కుంద్రా బెట్టింగ్ కూడా బీసీసీఐ, ఐపీఎల్‌కు అపఖ్యాతి తెచ్చిందని పేర్కొంది.
 
‘మెయ్యప్పన్ 60 లక్షలు పోగొట్టుకున్నాడు’
మెయ్యప్పన్ అవినీతి వ్యవతిరేక కోడ్, ఐపీఎల్ నిబంధనలను పూర్తిగా విస్మరించాడని కమిటీ చెప్పింది. ‘గురునాథ్‌కున్న భారీ బెట్టింగ్ అలవాటు కారణంగా రూ.60 లక్షల దాకా నష్టపోయాడు. అతడి వయస్సు  40. బెట్టింగ్ చేస్తే చెడ్డపేరు వస్తుందనే విషయం తెలియదని ఆయన చెబితే నమ్మలేం. తను, కుంద్రా చేసిన పని భారత క్రికెట్‌కు పెద్ద దెబ్బగానే భావిం చాలి’ అని కమిటీ  పేర్కొంది.  వీరిద్దరిపై ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో తామేమీ చెప్పలేమని, అది తమ పరిధిలోకి రాదని తేల్చింది.
 
‘విశ్వసనీయత దెబ్బతింది’
ఈ మొత్తం వ్యవహారం కారణంగా దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆటపై విశ్వసనీయత దెబ్బతిందని లోధా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తాము చూస్తున్నది నిజమైన ఆటేనా.. కాదా? అనే అపనమ్మకం అందరిలోనూ ఏర్పడిందని జస్టిస్ లోధా అన్నారు.
 
‘అవినీతి వ్యతిరేక కోడ్ ఆర్టికల్ 2.2.1 ప్రకారం గురునాథ్, రాజ్ కుంద్రాలను ఐదేళ్ల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అలాగే ఆర్టికల్ 7.5 లెవల్ 4 ప్రకారం క్రికెట్ నుంచి జీవిత కాల నిషేధం విధిస్తున్నాం. నిబంధన 4.2, సెక్షన్ 6 ప్రకారం ఏ రకమైన క్రికెట్ మ్యాచ్‌ల్లోనూ భాగస్వామ్యం కాకుండా జీవిత కాల నిషేధం విధిస్తున్నాం. ఈ ఆంక్షలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయి’          - లోధా కమిటీ
 
లోధా కమిటీ ఇచ్చిన తీర్పుతో షాక్‌కు గురయ్యాను. ఇందులో చాలా దోషాలున్నాయి. జడ్జిమెంట్ కాపీ కోసం విజ్ఞప్తి చేశాను. ఇది నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది.
 - ట్విట్టర్‌లో కుంద్రా
 
తీర్పును మేం ఇప్పటిదాకా చూడలేదు. మా న్యాయ సలహాదారులతో చర్చించాక ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. మా జట్టును పూర్తిగా రద్దు చేయలేదు. రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి వస్తాం. అయితే మాపై ఏదో ఒక చర్య ఉంటుందని భావించాం.
- చెన్నై సూపర్‌కింగ్స్ అధికారి.

కమిటీ తీర్పును బీసీసీఐ గౌరవిస్తోంది. పూర్తి నివేదిక చదివాక మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. మచ్చలేని క్రికెట్ కోసమే మేం పాటుపడుతున్నాం.
 - దాల్మియా (బీసీసీఐ అధ్యక్షుడు)
 
అసలేం జరిగిందంటే...
భారత క్రికెట్‌ను కుదిపేసిన ఈ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం 2013 సీజన్‌లో బయటపడింది. రాజస్తాన్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో కలకలం ప్రారంభమైంది.  చెన్నై టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్, రాజస్తాన్ సహ యజమాని కుంద్రా కూడా బెట్టింగ్‌లో భాగస్వామ్యులే అని తేలింది.
అదే ఏడాది మే 24న పోలీసులు గురునాథ్‌ను అరెస్ట్ చేశారు. కానీ ఐపీఎల్ పాలక మండలి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ గురునాథ్, కుంద్రాలకు క్లీన్‌చిట్ ఇచ్చింది.  దీన్ని ప్రశ్నిస్తూ బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
బీసీసీఐ ప్యానెల్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై బోర్డు సుప్రీం కెళ్లగా శ్రీనివాసన్, బీసీసీఐ, ఇండియా సిమెంట్స్, రాజస్తాన్‌లకు నోటీసులిచ్చింది.
అక్టోబర్‌లో ఈ స్కాండల్‌ను 4 నెలల్లో పరిశోధించాలంటూ సుప్రీం కోర్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీని నియమించింది.  ఆ కమిటీ గురునాథ్, కుంద్రాలను దోషులుగా పేర్కొంటూ పలువురు ఆటగాళ్లు, అధికారుల పేర్లతో సీల్డ్ కవర్‌ను కోర్టుకు అప్పగించింది. ఇక ఈ జనవరిలో జస్టిస్ లోధా ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని తుది తీర్పు కోసం సుప్రీం ఏర్పాటు చేసింది.
 
 
ఆటగాళ్లకు నష్టం లేదు
లోధా కమిటీ ఇచ్చిన తీర్పు తర్వాత ఐపీఎల్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే ఆందోళన పెరిగింది. ఇదే సమయంలో ఈ రెండు జట్లలోని స్టార్ క్రికెటర్ల సంగతేంటనే చర్చా మొదలైంది. ఎవరెవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం.
ఆటగాళ్లు: రాజస్తాన్, చెన్నై జట్లలో ధోని సహా పలువురు స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఆటగాళ్ల మీద తమ తీర్పు ప్రభావం ఉండదని, వారు ఇతర జట్లలో ఆడుకోవచ్చని కమిటీ పేర్కొంది. కాబట్టి ఆటగాళ్లకు నష్టం లేదు.
వచ్చే సీజన్ ఐపీఎల్: బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం బిడ్డింగ్‌లను ఆహ్వానించే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రెండు జట్ల స్థానంలో మరో రెండు జట్లు వస్తాయి. ఐపీఎల్‌లో ఒక్కో సీజన్‌లో 10 జట్ల వరకు ఆడే ప్రొవిజన్ ఉంది. ఆరు జట్లతో ఐపీఎల్‌ను నిర్వహిస్తే బోర్డుకు ఆర్థికంగా చాలా నష్టం. కాబట్టి వీలైనంత త్వరలో రెండు కొత్త జట్లను ఏర్పాటు చేయొచ్చు. ఈ విషయాలను చర్చించేందుకు ఈనెల 19న పాలక మండలి సమావేశం కానుంది.
ఆటగాళ్ల వేలం: రెండు కొత్త జట్లు వస్తే మళ్లీ వేలం నిర్వహించాల్సి రావచ్చు. ఈ రెండు జట్లలో కలిపి సుమారు 45 మంది క్రికెటర్లు ఉన్నారు. వీరి వరకే వేలం అంటే కొత్త ఫ్రాంచైజీలు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి మళ్లీ మొత్తం క్రికెటర్లందరినీ వేలంలోకి తేవడం ఒక ప్రత్యామ్నాయం.
శ్రీనివాసన్ పరిస్థితి: ప్రస్తుతం ఆయన ఐసీసీ చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఈ  వ్యవహారంలో ఆయన తప్పు లేకపోయినా... ఆయన అల్లుడు మెయ్యప్పన్ పాత్ర ఉంది కాబట్టి నైతిక విలువలను దృష్టిలో ఉంచుకుని ఆయన తప్పుకోవచ్చు. లేదంటే సెప్టెంబరులో బీసీసీఐ తప్పించే అవకాశం ఉంది.
సుందర్ రామన్ పరిస్థితి: ఐపీఎల్ సీఓఓపై మరింత విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. కాబట్టి ఆయనపై విచారణ పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగుతారు.
చెన్నై, రాజస్తాన్ ఏం చేయొచ్చంటే: లోధా కమిటీ నిర్ణయాన్ని ఈ రెండు ఫ్రాంచైజీలు కోర్టులో సవాల్ చేయొచ్చు. అదే సమయంలో ఈ జట్లను కొత్తవాళ్లకు అమ్మే ప్రయత్నం కూడా చేయొచ్చు. యజమానులు మారితే కొత్త పేర్లతో ఈ జట్లు బరిలోకి దిగొచ్చు.
కుంద్రా, మెయ్యప్పన్‌ల పరిస్థితి: ఫ్రాంచైజీల తరహాలోనే వ్యక్తులుగా వీళ్లు కూడా ఈ తీర్పును సవాల్ చేయొచ్చు. తొలుత ముద్గల్ కమిటీ విచారణలో ఈ ఇద్దరినీ జట్టు అధికారులుగానే పేర్కొన్నారు. కాబట్టి తిరిగి కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవచ్చు. కాబట్టి జీవితకాలం క్రికెట్‌కు దూరం కావాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement