పదవి నుంచి తప్పుకోనున్న శ్రీనివాసన్!
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన పట్టు వీడనున్నట్లు కనబడుతుంది. సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్కు సూచించడంతో ఆయన గురువారం పలువురు న్యాయవాదులను కలసి సలహా సంప్రదింపులు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే త్వరలో ఐసీసీ పీఠం అధిష్టించవచ్చా లేక ఏమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నయా అంటూ ఆయన తన తరపు న్యాయవాదులతో శ్రీనివాసన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు విధించిన గడువు రెండు రోజులు నేటితో ముగియనున్న నేపథ్యంలో శ్రీనివాసన్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు.
ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రెండు రోజుల్లో తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది.
ఐపీఎల్ జట్టు అవినీతి వ్యవహారాలలో శ్రీనివాసన్ అల్లుడు ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతం జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రెండు రోజులలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్కు సూచించింది. లేకుంటే తామే జోక్యం చేసుకుని అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని శ్రీనివాసన్ను సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.