N. Srinivasan
-
ఠాకూర్‌పై కోర్టుకెక్కిన శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బీసీసీఐ తరఫున తనపై దాఖలు చేసిన పిటిషన్లో బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుడు సమాచారం ఇచ్చారని... దీనిపై ఆయనను విచారించాలని మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కోర్టుకెక్కారు. తన గురించి వివరాలు ఇచ్చిన అఫిడవిట్ అంతా అబద్ధాలమయమని, అందులో రాసిన అంశాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని శ్రీనివాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసన్ బోర్డు సమావేశాలకు హాజరు కావచ్చా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని ఠాకూర్ ఈ నెల 11న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కాకుండా బోర్డు నియమావళిలోని 6.2.4 నిబంధనను మార్చిన సమయంలో ఉండి నాడు వ్యతిరేకించని ఠాకూర్, ఇప్పుడే అదే అంశంతో కోర్టుకెక్కడం అర్థం లేనిదని శ్రీని అన్నారు. గత నెల 28న వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో తాను లోపలికి దూసుకొచ్చి బలవంతం చేశాననే ఆరోపణలు ఆయన కొట్టివేశారు. తనపై వ్యక్తిగత కక్ష్యతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఠాకూర్‌పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. -
జోరుగా మంతనాలు
ఆసక్తికరంగా బీసీసీఐ అధ్యక్ష ఎన్నిక న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టిన రెండు వర్గాలు తమ తరహాలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ శుక్రవారం కొంత మంది తన మద్దతుదారులతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఈస్ట్‌జోన్ సంఘాల ప్రతినిధులతో కూడా మాట్లాడేందుకు శ్రీనివాసన్ ప్రయత్నించినా వారెవరూ ఈ సమావేశానికి రాలేదని తెలిసింది. అమితాబ్ చౌదరికి మద్దతిచ్చే అవకాశాన్ని శ్రీని కొట్టిపారేయలేదు. మరో వైపు గురువారం నాగపూర్‌లో పవార్‌తో జరిగిన సమావేశంలో కూడా ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. పవార్‌కు సంబంధించి నాలుగు ఓట్లు ఉండటంతో ఆయనతో శ్రీనివాసన్ చర్చించినా ఎలాంటి హామీ దక్కలేదు. పవార్ కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తితో ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. అటు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా రాజీవ్ శుక్లాకు మద్దతుగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. -
బీసీసీఐ పిటిషన్ పై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: బీసీసీఐ అధికార సమావేశాలకు మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ హాజరు కావొచ్చా?లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. అయితే విచారణ చేపట్టే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ రోజు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన జస్టిస్ టీఎస్ థాకూర్.. త్వరలో బీసీసీఐ తరుపు వాదనలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లు అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ కు స్పష్టం చేశారు. శ్రీనివాసన్ అంశంపై స్పష్టత రానందున ఈనెల 27న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. బోర్డు సమావేశానికి తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ఎన్. శ్రీనివాసన్ హాజరు కావొచ్చా? లేదా అనేది తేలే వరకు ఈ సమావేశం జరిగే అవకాశం లేదని.. కోర్టు ఆదేశాల తర్వాత ఏజీఎంను నిర్వహిస్తామని కార్యదర్శి ఠాకూర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే బీసీసీఐ సెప్టెంబర్ 12 వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
'బీసీసీఐ మీటింగ్‌లకు ఆయన హాజరుకావచ్చా?'
ముంబయి : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ విషయమై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) శనివారం నాడు సుప్రీంకోర్టును సంప్రదించాల్సి వచ్చింది. బీసీసీఐ అధికారిక సమావేశాలకు శ్రీని హాజరు కావచ్చా.. లేదా అనే విషయంపై స్పష్టత కోసం బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు సలహాను కోరారు. నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో నిషేధానికి రెండు జట్లపై ఐపీఎల్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించడానికి గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున శ్రీని హాజరుకావడంతో సమావేశం రద్దయింది. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీకి శ్రీని కంపెనీ ఇండియా సిమెంట్స్ వాటాలను ఎలా అమ్మిందన్న దానిపై స్పష్టతలేని కారణంగా కొంత సందిగ్ధత నెలకొందన్నది వాస్తవం. ఫిక్సింగ్ ఆరోపణలు రుజువైనందున జస్టిస్ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విదించిన విషయం విదితమే. -
శ్రీనివాసన్ రాకతో...
కోల్‌కతా: భారత క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే దీనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ప్రతినిధిగా మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరు కావడమే దీనికి కారణం. శ్రీనివాసన్ దీనికి హాజరు కావొచ్చా లేదా అనేదానిపై తాము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ వివాదం నేపథ్యంలో గతంలో బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ పోటీ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆయన ఈ సమావేశానికి ఎలా వస్తారని కొందరు సభ్యులు వాదించడంతో వివాదం చోటు చేసుకుంది. అయితే జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయం ప్రకారం తనకా హక్కు ఉందని శ్రీనివాసన్ తన రాకను సమర్థించుకున్నారు. దీనిపై మరింత వాదన జరగడంతో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని రద్దు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో బోర్డు మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లోధా కమిటీ సిఫారసులపై చర్చ, వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే జట్లపై నిర్ణయం, జాతీయ క్రికెట్ అకాడమీ తరలింపు, భారత జట్టు కోచ్ ఎంపిక తదితర అంశాలు ఈ సమావేశం అజెండాలో ఉన్నాయి. మరో వైపు వార్షిక అకౌంట్ల ఆమోదం మినహా బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో కూడా ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు. -
బీసీసీఐ అధ్యక్ష బరిలో శరద్ పవార్?
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ సన్నద్ధమవుతున్నారా?అంటే తాజా పరిణామాలతో అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించిఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం కావాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు దూరంగా ఉంటానని శ్రీనివాసన్ సుప్రీంకోర్టు తెలిపినా అతని భవితవ్యంపై ఇంకా నీలి నీడలు మాత్రం వదల్లేదు. దీంతో శరద్ పవార్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 నుంచి 2008 వరకూ బీసీసీఐ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవం శరద్ పవార్ కు ఉండటంతో అది తనకు అనుకూలంగా మార్చుకునేందుకే యత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగానే కోర్టు నిర్ణయంపై శ్రీనివాస్ స్పందించే తీరును పరిశీలించాకే తన నిర్ణయాన్ని పవార్ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం ఫిబ్రవరి 14 వరకూ వేచి చూడాలని పవార్ యోచి చూస్తున్నారు. జనవరి 22 వ తీర్పులో సుప్రీంకోర్టు మరో ఆరు వారాల్లో బీసీసీఐ ఎన్నికల జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు మహామహులు అంతా ఆ పనిలో పడ్డారు. -
చేతులు మారనున్న చెన్నై!
ముంబై: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్. శ్రీనివాసన్ తన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య బాధ్యతలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారా... జట్టును మరొకరికి అమ్మి బీసీసీఐ అధ్యక్ష పదవిని అందుకోవాలనుకుంటున్నారా... ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఐపీఎల్ జట్లను రద్దు చేయడం లేదా కొనసాగించే విషయంలో కోర్టు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో ఈ సీజన్‌కు చెన్నై, రాజస్థాన్ జట్లు కొనసాగుతున్నట్లుగానే భావించాలి. ఫిబ్రవరి 16న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. వాస్తవానికి గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9-10 తేదీల్లోనే వేలం జరగాలి. అయితే చెన్నై జట్టు యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చేందుకు, తన ఫ్రాంచైజీని అమ్మేందుకు శ్రీనివాసన్‌కు మరి కొంత సమయం లభించేందుకు దీనిని పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి. త్రిషకు కాబోయే భర్త కూడా... చెన్నై జట్టును కొనుగోలు చేసే విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రఖ్యాత మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్) ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్త, బిల్డర్ వరుణ్ మణియన్ కూడా జట్టును తీసుకునే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. ఇటీవలే ప్రముఖ నటి త్రిషతో నిశ్చితార్థం జరుపుకోవడంతో వరుణ్ వార్తల్లోకి వచ్చాడు. ఇతను కూడా శ్రీనివాసన్ కుటుంబానికి సన్నిహితుడనే తెలుస్తోంది. బోర్డు పదవిపైనే శ్రీనివాసన్ ఆసక్తి చూపుతున్నారు కాబట్టి... మార్పు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావచ్చని, అయితే ఇంకా ఎవరూ తమను నేరుగా సంప్రదించలేదని ఆయన సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. అమ్మకం సాధ్యమేనా! మరో వైపు చెన్నై జట్టు అమ్మకం ప్రక్రియ సజావుగా సాగడంపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు అనంతరం పరిస్థితి చూస్తే ఏ దశలోనైనా జట్టు రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి టీమ్‌ను ఎవరూ సొంతం చేసుకుంటారనేది ప్రశ్న. సుప్రీం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ తుది నివేదిక ఇచ్చే వరకు జట్టును అమ్మడానికి వీలు కాదని, అలా చేసినా దానిపై ‘స్టే’ ఉత్తర్వులు రావచ్చని కూడా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు సుప్రీం తీర్పును గౌరవిస్తూనే, ఇటు శ్రీనివాసన్‌కు కూడా సమస్య రాకుండా మధ్యేమార్గంగా బీసీసీఐలోనే సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మధ్యవర్తిత్వం చేయనున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఐపీఎల్-8కు ముందే పని చేయడం ప్రారంభిస్తే, ఏం చేయాలనేదానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ స్పష్టం చేశారు. -
'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'
చెన్నై: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఐసీసీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు అని శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ క్రికెట్ రంగంపై ఎంఎస్ ధోని ప్రభావం ఎక్కువగా ఉంది అని ఆయన తెలిపారు. ధోని గొప్ప క్రికెటర్, భారత జట్టును ముందుకు నడిపించడంలో ఆయన వ్యూహాలు అమోఘమన్నారు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలతోపాటు అన్ని ప్రధాన టోర్నిల్లో భారత్ కు విజయాన్ని అందించారని శ్రీనివాసన్ తెలిపారు. క్రికెట్ రంగానికి ఇండియా సిమెంట్స్ ఎనలేని కృషి చేసిందని, ఎందరో క్రికెటర్ల భవిష్యత్ ను తీర్చిదిద్దందని శ్రీనివాసన్ తెలిపారు. -
శ్రీనివాసనే ఐసీసీ చైర్మన్ అభ్యర్థి
మరోసారి ఖరారు చేసిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐసీసీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఎన్.శ్రీనివాసన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బీసీసీఐ మరోసారి ఖరారు చేస్తూ ఐసీసీకి సమాచారమిచ్చింది. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషన్ దాఖలు చేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (క్యాబ్)కు అధికారిక గుర్తింపు లేనందున సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 23 నుంచి 28 వరకు జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశం అనంతరం 29న శ్రీనివాసన్.. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బీసీసీఐ ఇంతకుముందే నిర్ణయించినా.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎన్నికకు వారం రోజులు ముందు మరోసారి దాన్ని ఖరారు చేయాల్సివుంటుంది. -
మేం కళ్లు మూసుకోం...
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఎన్. శ్రీనివాసన్, మరో 12 మందిపై బీసీసీఐ విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన బీసీసీఐ ఈ వ్యవహారంపై మిన్నకున్నా తాము మాత్రం కళ్లు మూసుకోమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ తన నివేదికలో చేసిన ఆరోపణలపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. కమిటీ ప్రతిపాదనలను శ్రీనివాసన్ సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఐపీఎల్-7కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సుందర్ రామన్‌ను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలనే దానిపై నిర్ణయాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ రిజర్వు చేసింది. -
బీసీసీఐ ఉపాధ్యక్షుడికే అధ్యక్ష బాధ్యతలు:సుప్రీం
ఐపీఎల్‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేసింది. ఐపీఎల్లో ఆడకుండా ఏ ఆటగాడిని కానీ, జట్టును గాని నిలవరించలేమని పేర్కొంది. బీసీసీఐ ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా వ్యవహరించాలని సూచించింది. ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తయ్యేంత వరకు గవాస్కర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది.ఐసీసీ కార్యకలాపాల్లో శ్రీనివాసన్ పాల్గొనేలా ఉత్తర్వులు ఇవ్వాలని బీసీసీఐ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే శ్రీనివాసన్ తన పదవి నుంచి తప్పుకోవాలని మంగళవారం సుప్రీంకోర్టు సూచించింది.అందుకు రెండు రోజుల గడువు కూడా విధించింది. లేకుంటే తామే శ్రీనివాసన్‌ను ఆ పదవి నుంచి తొలగించ వలసి వస్తుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పదవి నుంచి తప్పుకోనున్న శ్రీనివాసన్!
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన పట్టు వీడనున్నట్లు కనబడుతుంది. సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్‌కు సూచించడంతో ఆయన గురువారం పలువురు న్యాయవాదులను కలసి సలహా సంప్రదింపులు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే త్వరలో ఐసీసీ పీఠం అధిష్టించవచ్చా లేక ఏమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నయా అంటూ ఆయన తన తరపు న్యాయవాదులతో శ్రీనివాసన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు విధించిన గడువు రెండు రోజులు నేటితో ముగియనున్న నేపథ్యంలో శ్రీనివాసన్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రెండు రోజుల్లో తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. ఐపీఎల్ జట్టు అవినీతి వ్యవహారాలలో శ్రీనివాసన్ అల్లుడు ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతం జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రెండు రోజులలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్‌కు సూచించింది. లేకుంటే తామే జోక్యం చేసుకుని అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
తప్పు జరగలేదు... ఆది కోర్టులో తేలుతుంది
పెట్టుబడుల కేసుపై మీడియాతో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పూచీకత్తు బాండ్లు సమర్పించిన శ్రీనివాసన్, జగన్ తదితరులు కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా సాక్షి, హైదరాబాద్: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో తమ సంస్థ పెట్టుబడుల వ్యవహారంలో ఎటువంటి తప్పూ జరగలేదని, కోర్టు విచారణలో అది రుజువవుతుందని ఇండియా సిమెంట్స్ చైర్మన్, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ చార్జిషీట్ వ్యవహారంలో ఆయన శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు నిర్దేశించిన మేరకు రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించారు. నిందితుల జాబితాలో ఉన్న ఇండియా సిమెంట్స్ తరఫున చైర్మన్ హోదాలో శ్రీనివాసన్ పూచీకత్తు బాండ్లు సమర్పించారు. ఈ బాండ్లను ప్రత్యేక కోర్టుల ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ ఆమోదించారు. తదుపరి విచారణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. కోర్టు విచారణ అనంతరం బయటకొచ్చిన ఆయనతో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ కేసు విషయంలో చెప్పడానికి ఏమీ లేదన్నారు. తాము తప్పు చేయలేదని, అది కోర్టు విచారణలో నిరూపితమవుతుందని అన్నారు. తరువాత అక్కడి నుంచి లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్మోహన్రెడ్డి, విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడ కొంతసేపు గడిపిన ఆయన తర్వాత చెన్నైకు వెళ్లిపోయారు. పూచీకత్తులు సమర్పించిన జగన్... ఈ కేసులో మొదటి నిందితునిగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యనాథ్‌దాస్ కోర్టు నిర్దేశించిన మేరకు రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, వ్యక్తిగత పూచీకత్తు బాండును సమర్పించారు. ఈ బాండ్లను ఆమోదించిన న్యాయమూర్తి... తదుపరి విచారణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని వారిని ఆదేశించారు. రఘురామ్ సిమెంట్స్, కార్మెల్ ఏషియా సంస్థల చైర్మన్ హోదాలో జగన్‌ను సీబీఐ నిందితునిగా పేర్కొంది. అయితే ఈ కంపెనీల్లో జగన్ ఏ హోదాలోనూ లేరని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీల తరఫున ఇతర ప్రతినిధులు హాజరై పూచీకత్తు బాండ్లు సమర్పించేందుకు అనుమతించాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి డిసెంబర్ 3కు వాయిదా వేశారు. వెల్లువెత్తిన అభిమానం... జగన్మోహన్రెడ్డి కోర్టుకు హాజరైన సమయంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు వచ్చారు. అలాగే సీబీఐ కోర్టు ఉన్న గగన్‌విహార్ వద్ద జగన్‌ను చూసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. పూచీకత్తు బాండ్ల పరిశీలన సమయంలో కోర్టు విచారణ పది నిమిషాల పాటు వాయిదాపడగా, కోర్టు బయటకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పోటీపడ్డారు. ఆయన ఒక్కొక్కర్నీ పరిచయం చేసుకొని, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కోర్టు విచారణ తరువాత కూడా అక్కడున్న ఉద్యోగులను పలుకరిస్తూ ముందుకు సాగిపోయారు. ‘‘జగన్‌ను చూడాలని, ఆయన్ను పలకరించాలని ఇక్కడికి వచ్చా. ఆయనతో మాట్లాడటం ఆనందంగా ఉంది’’ అని ఓ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ రాక సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సామాన్యులెవ్వర్నీ గగన్విహార్లోకి అనుమతించలేదు. -
మళ్లీ చిక్కుల్లో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. వైఎస్ జగన్ ఆస్టుల కేసులో మంగళవారం దాఖలు చేసిన మూడు చార్జిషీట్లలో ఓ చార్జిషీట్ లో శ్రీనివాసన్ పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు చేర్చింది. ఇండియా సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో తాజా సీబీఐ చార్జిషీట్ లో మూడవ వ్యక్తిగా శ్రీనివాసన్ పేరును చేర్చింది. ఇండియా సిమెంట్ కంపెనీ అధినేత శ్రీనివాసన్ భారీగా పెట్టుబడులను పెట్టినట్టు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. తాజా చార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరును సీబీఐ మినహాయించింది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కష్టాల్లో పడిన శ్రీనివాసన్ కు తాజా వ్యవహారం ఇబ్బంది కలిగించే విషయమే.