న్యూఢిల్లీ: బీసీసీఐ అధికార సమావేశాలకు మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ హాజరు కావొచ్చా?లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. అయితే విచారణ చేపట్టే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ రోజు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన జస్టిస్ టీఎస్ థాకూర్.. త్వరలో బీసీసీఐ తరుపు వాదనలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లు అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ కు స్పష్టం చేశారు.
శ్రీనివాసన్ అంశంపై స్పష్టత రానందున ఈనెల 27న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. బోర్డు సమావేశానికి తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ఎన్. శ్రీనివాసన్ హాజరు కావొచ్చా? లేదా అనేది తేలే వరకు ఈ సమావేశం జరిగే అవకాశం లేదని.. కోర్టు ఆదేశాల తర్వాత ఏజీఎంను నిర్వహిస్తామని కార్యదర్శి ఠాకూర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే బీసీసీఐ సెప్టెంబర్ 12 వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.