
ఠాకూర్‌పై కోర్టుకెక్కిన శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బీసీసీఐ తరఫున తనపై దాఖలు చేసిన పిటిషన్‌లో బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుడు సమాచారం ఇచ్చారని... దీనిపై ఆయనను విచారించాలని మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కోర్టుకెక్కారు. తన గురించి వివరాలు ఇచ్చిన అఫిడవిట్ అంతా అబద్ధాలమయమని, అందులో రాసిన అంశాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని శ్రీనివాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసన్ బోర్డు సమావేశాలకు హాజరు కావచ్చా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని ఠాకూర్ ఈ నెల 11న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కాకుండా బోర్డు నియమావళిలోని 6.2.4 నిబంధనను మార్చిన సమయంలో ఉండి నాడు వ్యతిరేకించని ఠాకూర్, ఇప్పుడే అదే అంశంతో కోర్టుకెక్కడం అర్థం లేనిదని శ్రీని అన్నారు. గత నెల 28న వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో తాను లోపలికి దూసుకొచ్చి బలవంతం చేశాననే ఆరోపణలు ఆయన కొట్టివేశారు. తనపై వ్యక్తిగత కక్ష్యతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఠాకూర్‌పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు.