చేతులు మారనున్న చెన్నై!
ముంబై: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్. శ్రీనివాసన్ తన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య బాధ్యతలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారా... జట్టును మరొకరికి అమ్మి బీసీసీఐ అధ్యక్ష పదవిని అందుకోవాలనుకుంటున్నారా... ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఐపీఎల్ జట్లను రద్దు చేయడం లేదా కొనసాగించే విషయంలో కోర్టు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు.
దాంతో ఈ సీజన్‌కు చెన్నై, రాజస్థాన్ జట్లు కొనసాగుతున్నట్లుగానే భావించాలి. ఫిబ్రవరి 16న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. వాస్తవానికి గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9-10 తేదీల్లోనే వేలం జరగాలి. అయితే చెన్నై జట్టు యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చేందుకు, తన ఫ్రాంచైజీని అమ్మేందుకు శ్రీనివాసన్‌కు మరి కొంత సమయం లభించేందుకు దీనిని పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి.
త్రిషకు కాబోయే భర్త కూడా...
చెన్నై జట్టును కొనుగోలు చేసే విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రఖ్యాత మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్) ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్త, బిల్డర్ వరుణ్ మణియన్ కూడా జట్టును తీసుకునే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. ఇటీవలే ప్రముఖ నటి త్రిషతో నిశ్చితార్థం జరుపుకోవడంతో వరుణ్ వార్తల్లోకి వచ్చాడు.
ఇతను కూడా శ్రీనివాసన్ కుటుంబానికి సన్నిహితుడనే తెలుస్తోంది. బోర్డు పదవిపైనే శ్రీనివాసన్ ఆసక్తి చూపుతున్నారు కాబట్టి... మార్పు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావచ్చని, అయితే ఇంకా ఎవరూ తమను నేరుగా సంప్రదించలేదని ఆయన సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.
అమ్మకం సాధ్యమేనా!
మరో వైపు చెన్నై జట్టు అమ్మకం ప్రక్రియ సజావుగా సాగడంపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు అనంతరం పరిస్థితి చూస్తే ఏ దశలోనైనా జట్టు రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి టీమ్‌ను ఎవరూ సొంతం చేసుకుంటారనేది ప్రశ్న. సుప్రీం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ తుది నివేదిక ఇచ్చే వరకు జట్టును అమ్మడానికి వీలు కాదని, అలా చేసినా దానిపై ‘స్టే’ ఉత్తర్వులు రావచ్చని కూడా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో అటు సుప్రీం తీర్పును గౌరవిస్తూనే, ఇటు శ్రీనివాసన్‌కు కూడా సమస్య రాకుండా మధ్యేమార్గంగా బీసీసీఐలోనే సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మధ్యవర్తిత్వం చేయనున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఐపీఎల్-8కు ముందే పని చేయడం ప్రారంభిస్తే, ఏం చేయాలనేదానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ స్పష్టం చేశారు.