ప్రేమించడానికి రెడీ కానీ..
చెన్నై : సంచలన హీరోయిన్లలో త్రిష ఒకరు. ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో ఉంటారు. సినీ పరిశ్రమలో 13 ఏళ్లకు పైగా ప్రముఖ కథానాయిక వెలుగొందుతున్నారు. కొత్త నాయికలు వరుసకడుతున్న ఈ రోజుల్లో ఇంత సుదీర్ఘ కాలం రాణించడం సాధారణ విషయం కాదు. ఇంకో విషయం ఏమిటంటే 30 ఏళ్లు పైబడిన త్రిషను చూస్తే అంత వయసుందని అనుకోలేం.
ఇంతకు ముందు త్రిషపై రకరకాల వదంతులు ప్రచారం అయ్యాయి. ఆ రూమర్లకు చెలించని త్రిష ఇటీవల వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్ ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధం అయ్యారు.నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో వరుణ్ మణియన్‌కు కటీఫ్ చెప్పేశారు. కారణాలు ఏమైనా త్రిష ఇసుమంత కూడా బాధ వ్యక్తం చేయలేదు. దీన్ని చాలా ఈజీగా తీసుకున్నారు.
మరో విషయం ఏమిటంటే అప్పటి వరకూ నత్తనడకన నడిచిన ఆమె సినీ కేరీర్ ఆ తర్వాతే జెట్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం త్రిషకు చేతినిండా సినిమాలు. ఈ పరిస్థితిలో మళ్లీ ప్రేమలో పడతారా? అన్న ప్రశ్నకు ‘ఓ ఎస్.. నచ్చినోడు తారసపడితే ప్రేమిస్తా.. మనసులు కలిస్తే పెళ్లి కూడా చేసుకుంటా..’ అని బదులిచ్చారు. అయితే వయసు దాటిపోతుందనో, సమాజం కోసమే పెళ్లి చేసుకోవాలనుకోను అని చెప్పారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై-2 చిత్రంలో, నాయకి అనే హారర్ నేపథ్యంలో సాగే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. కమల్ హాసన్‌తో నటించిన తూంగావనం చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది.