పెట్టుబడుల కేసుపై మీడియాతో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్
పూచీకత్తు బాండ్లు సమర్పించిన శ్రీనివాసన్, జగన్ తదితరులు
కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో తమ సంస్థ పెట్టుబడుల వ్యవహారంలో ఎటువంటి తప్పూ జరగలేదని, కోర్టు విచారణలో అది రుజువవుతుందని ఇండియా సిమెంట్స్ చైర్మన్, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ చార్జిషీట్ వ్యవహారంలో ఆయన శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు నిర్దేశించిన మేరకు రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించారు. నిందితుల జాబితాలో ఉన్న ఇండియా సిమెంట్స్ తరఫున చైర్మన్ హోదాలో శ్రీనివాసన్ పూచీకత్తు బాండ్లు సమర్పించారు.
ఈ బాండ్లను ప్రత్యేక కోర్టుల ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ ఆమోదించారు. తదుపరి విచారణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. కోర్టు విచారణ అనంతరం బయటకొచ్చిన ఆయనతో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ కేసు విషయంలో చెప్పడానికి ఏమీ లేదన్నారు. తాము తప్పు చేయలేదని, అది కోర్టు విచారణలో నిరూపితమవుతుందని అన్నారు. తరువాత అక్కడి నుంచి లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడ కొంతసేపు గడిపిన ఆయన తర్వాత చెన్నైకు వెళ్లిపోయారు.
పూచీకత్తులు సమర్పించిన జగన్...
ఈ కేసులో మొదటి నిందితునిగా ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యనాథ్‌దాస్ కోర్టు నిర్దేశించిన మేరకు రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, వ్యక్తిగత పూచీకత్తు బాండును సమర్పించారు. ఈ బాండ్లను ఆమోదించిన న్యాయమూర్తి... తదుపరి విచారణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని వారిని ఆదేశించారు. రఘురామ్ సిమెంట్స్, కార్మెల్ ఏషియా సంస్థల చైర్మన్ హోదాలో జగన్‌ను సీబీఐ నిందితునిగా పేర్కొంది. అయితే ఈ కంపెనీల్లో జగన్ ఏ హోదాలోనూ లేరని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీల తరఫున ఇతర ప్రతినిధులు హాజరై పూచీకత్తు బాండ్లు సమర్పించేందుకు అనుమతించాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి డిసెంబర్ 3కు వాయిదా వేశారు.
వెల్లువెత్తిన అభిమానం...
జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరైన సమయంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు వచ్చారు. అలాగే సీబీఐ కోర్టు ఉన్న గగన్‌విహార్ వద్ద జగన్‌ను చూసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. పూచీకత్తు బాండ్ల పరిశీలన సమయంలో కోర్టు విచారణ పది నిమిషాల పాటు వాయిదాపడగా, కోర్టు బయటకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పోటీపడ్డారు. ఆయన ఒక్కొక్కర్నీ పరిచయం చేసుకొని, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కోర్టు విచారణ తరువాత కూడా అక్కడున్న ఉద్యోగులను పలుకరిస్తూ ముందుకు సాగిపోయారు. ‘‘జగన్‌ను చూడాలని, ఆయన్ను పలకరించాలని ఇక్కడికి వచ్చా. ఆయనతో మాట్లాడటం ఆనందంగా ఉంది’’ అని ఓ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ రాక సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సామాన్యులెవ్వర్నీ గగన్‌విహార్‌లోకి అనుమతించలేదు.
తప్పు జరగలేదు... ఆది కోర్టులో తేలుతుంది
Published Sat, Nov 2 2013 2:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement