బీసీసీఐ అధ్యక్ష బరిలో శరద్ పవార్?
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ సన్నద్ధమవుతున్నారా?అంటే తాజా పరిణామాలతో అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించిఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం కావాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు దూరంగా ఉంటానని శ్రీనివాసన్ సుప్రీంకోర్టు తెలిపినా అతని భవితవ్యంపై ఇంకా నీలి నీడలు మాత్రం వదల్లేదు.
దీంతో శరద్ పవార్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 నుంచి 2008 వరకూ బీసీసీఐ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవం శరద్ పవార్ కు ఉండటంతో అది తనకు అనుకూలంగా మార్చుకునేందుకే యత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగానే కోర్టు నిర్ణయంపై శ్రీనివాస్ స్పందించే తీరును పరిశీలించాకే తన నిర్ణయాన్ని పవార్ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం ఫిబ్రవరి 14 వరకూ వేచి చూడాలని పవార్ యోచి చూస్తున్నారు. జనవరి 22 వ తీర్పులో సుప్రీంకోర్టు మరో ఆరు వారాల్లో బీసీసీఐ ఎన్నికల జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు మహామహులు అంతా ఆ పనిలో పడ్డారు.