BCCI elections
-
గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..?
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు, మాజీ ఆల్‌రౌండర్, భారత మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ పేరు గురువారం బీసీసీఐ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ లో కనిపించింది. బీసీసీఐ నిర్వహించబోయే వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తరఫున రోజర్ బిన్నీ పేరు ఉంది. గతంలో కేఎస్పీఏ తరఫున సంతోష్ మీనన్ సమావేశాలకు హాజరయ్యేవాడు. తాజాగా మీనన్ స్థానంలో బిన్నీ సమావేశాలకు హాజరుకానుండటంతో బీసీసీఐ అధ్యక్ష ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిన్నీకి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముందు నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన జై షాకు అతని తండ్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశిస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఈ ప్రచారాల సంగతి అటుంచితే.. బీసీసీఐ కొత్త బాస్ ఎవరనేది తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే. బీసీసీఐ అధ్యక్ష పదవి సహా పలు కీలక పోస్టులకు అక్టోబర్ 11, 12 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న పోటీలో ఉన్న సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. అనంతరం అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ.. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి. -
బీసీసీఐ ఎన్నికలు: ముహూర్తం ఖరారు
ముంబై: ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డులో ఎన్నికలకు నగారా మోగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోని పదవుల కోసం అక్టోబర్ 18న ఎన్నికలు జరపనున్నట్లు బోర్డు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా నిర్వహిస్తారు. భారత ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ ఏకే జోటి దీనికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన ఆయన ఈ వివరాలను ఇప్పటికే బీసీసీఐ పరిధిలోని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అందించారు. వీరంతా తమ సంఘం తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను బోర్డుకు పంపించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నికల ప్రక్రియలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారే బరిలోకి దిగాలని కూడా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా సూచించారు. బోర్డు నియమావళి ప్రకారం ఐదు కీలకమైన ఆఫీస్ బేరర్ పదవులకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి) ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు ఒక అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిని, ఇద్దరు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించనుండగా... 18న ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే బీసీసీఐ ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉన్నా... వివిధ అంశాలపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత కోరుతూ బోర్డు ఇప్పటి వరకు ఆగింది. ఇటీవల సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కీలక ఆదేశాలు రావడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సౌరవ్ గంగూలీ, జై షా అదే పదవుల కోసం బరిలో ఉంటారా... లేక వీరిలో ఒకరు ఐసీసీ వైపు వెళ్లి కొత్తవారు ఆ పదవిలో వస్తారా వేచి చూడాలి. -
బీసీసీఐ ఎన్నికలు ఏకగ్రీవమే!
ముంబై: సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐలో జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవం కాబోతున్నాయి. ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్‌లోని ఎనిమిది స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా వీరందరూ ఎన్నిక కావడం ఖాయమైపోయింది. అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న వీరంతా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అట్టహాసంగా... చివరి రోజైన సోమ వారమే గంగూలీ, జై షా తమ నామినేషన్లు దాఖలు చేశారు. గంగూలీ వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, మాజీ కార్యదర్శి నిరంజన్ షాతో పాటు రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. అయితే గంగూలీ వెళ్లిన సమయంలో ఎన్నికల అధికారి ఎన్.గోపాలస్వామి అక్కడ లేరు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో సౌరవ్ అక్కడి అధికారులకు తమ నామినేషన్ పత్రాలు అందించి వెనుదిరిగారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రంలో ఆయన సంతకం చేశారు. ఏసీఏ కోశాధికారి గోపీనాథ్ రెడ్డి, భారత మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు కూడా వీరి వెంట ఉన్నారు. సౌరవ్ గంగూలీ (అధ్యక్షుడు): భారత క్రికెట్ మాజీ కెప్టెన్. కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన అనుభవం. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు): ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి. జయేష్ జార్జ్ (సంయుక్త కార్యదర్శి): కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు. ఖైరుల్ జమీల్ మజుందార్ (గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు); ప్రభ్‌జోత్ సింగ్ భాటియా (కౌన్సిలర్). బ్రిజేశ్ పటేల్ (ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు): మాజీ క్రికెటర్. భారత్ తరఫున 21 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. కర్ణాటక సంఘం నుంచి ప్రాతినిధ్యం. అరుణ్ సింగ్ ధుమాల్ (కోశాధికారి): కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు. హిమాచల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. జై షా (కార్యదర్శి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, వ్యాపారవేత్త. ఇటీవలి వరకు గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. -
అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన అక్టోబర్ 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న జరుగుతాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. అదే విధంగా రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. -
హోరాహోరీ...ఉత్కంఠ...
-
హోరాహోరీ...ఉత్కంఠ...
ఆసక్తికరంగా జరిగిన బీసీసీఐ ఎన్నికలు ఒక్క ఓటుతో కార్యదర్శిగా నెగ్గిన ఠాకూర్ మిగతా పదవులన్నీ శ్రీనివాసన్ వర్గానివే దాల్మియా, గంగరాజు ఏకగ్రీవమే క్రాస్ ఓటింగ్, అధ్యక్షుడి నిర్ణయాత్మక ఓటు, ఒకే ఓటుతో ఫలితం మార్పు, సంచలన విజయం, చైర్మన్‌పై ఆరోపణలు ...ఇలా క్రికెట్ మ్యాచ్‌ను తలపించేలా అన్ని మలుపులతో బీసీసీఐ ఎన్నికలు జరిగాయి. ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని భావించినా.... కొన్ని ప్రధాన పదవుల కోసం హోరాహోరీగా పోరు సాగింది. అతి ముఖ్యమైన కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికలో అనురాగ్ ఠాకూర్ ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రస్తుత కార్యదర్శి సంజయ్ పటేల్‌ను ఓడించారు. సాక్షి, చెన్నై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన తన ప్రత్యర్థి సంజయ్ పటేల్‌పై ఒక ఓటు తేడాతో నెగ్గారు. పటేల్, శ్రీనివాసన్‌కు ఆత్మీయుడు కాగా, ఠాకూర్‌ను పవార్ వర్గం బలపరిచింది. అయితే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన ఠాకూర్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఇది మినహా అంతటా శ్రీని వర్గం ఆధిపత్యం కనిపించింది. మరో వైపు అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు ఆయన పేరును ప్రతిపాదించగా.... అటు శ్రీనివాసన్, ఇటు పవార్ వర్గీయులు మొత్తం దాల్మియాకు మద్దతుగా నిలిచారు. సంయుక్త కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికలో అమితాబ్ చౌదరి, చేతన్ దేశాయ్ మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. వీరిద్దరికి సమంగా ఓట్లు వచ్చాయి. దాంతో అధ్యక్ష స్థానంలో ఉన్న శివలాల్ తన నిర్ణయాత్మక ఓటు అమితాబ్‌కు వేసి గెలిపించారు. ఐదు ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురు... గోకరాజు గంగరాజు (ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి-సౌత్‌జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్), నెహ్రూ (నార్త్) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సెంట్రల్ జోన్ తరఫున సీకే ఖన్నా ఎన్నికయ్యారు. పవార్ బలపరిచిన జ్యోతిరాదిత్య సింథియాపై ఆయన సంచలన విజయం సాధించడం విశేషం. వెస్ట్ తరఫున రవిసావంత్‌ను ఓడించి టీసీ మ్యాథ్యూ ఉపాధ్యక్షుడయ్యారు. బోర్డులో సుదీర్ఘ కాలంగా ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్న రాజీవ్‌శుక్లాకు కూడా ఓటమి ఎదురైంది. కోశాధికారి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో అనిరుధ్ చౌదరి... శుక్లాపై గెలుపొందారు. ఐసీసీ సీఈ సమావేశాల్లో ఇకపై ఠాకూర్ బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తారని ఏజీఎంలో ఖరారు చేశారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని ప్రస్తుత క్రికెట్ సెలక్షన్ కమిటీ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పెంచుతూ కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శివలాల్‌పై ఆరోపణలు: ఏజీఎంకు అధ్యక్షత వహించిన శివలాల్ యాదవ్ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. బరోడా సంఘం తరఫున రాకేశ్ పారిఖ్‌ను అనర్హతకు గురి చేస్తూ... సమర్జిత్ గైక్వాడ్‌కు ఓటింగ్ అవకాశం ఇవ్వడాన్ని కొందరు తప్పుపట్టారు. ఉపాధ్యక్షుడిగా పోటీచేసి ఓడిన రవిసావంత్ ఈ వివాదంపై మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. బీసీసీఐ కొత్త కార్యవర్గం అధ్యక్షుడు: జగ్మోహన్ దాల్మియా కార్యదర్శి: అనురాగ్ ఠాకూర్ సంయుక్త కార్యదర్శి: అమితాబ్ చౌదరి కోశాధికారి: అనిరుధ్ చౌదరి ఉపాధ్యక్షులు: ఎంఎల్ నెహ్రూ (నార్త్), గోకరాజు గంగరాజు (సౌత్), గౌతమ్ రాయ్ (ఈస్ట్), టీసీ మ్యాథ్యూ (వెస్ట్), సీకే ఖన్నా (సెంట్రల్). బీసీసీఐ ఎన్నికలు, అనురాగ్ ఠాకూర్, శ్రీనివాసన్, -
బీసీసీఐ అధ్యక్ష బరిలో శరద్ పవార్?
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ సన్నద్ధమవుతున్నారా?అంటే తాజా పరిణామాలతో అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించిఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం కావాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు దూరంగా ఉంటానని శ్రీనివాసన్ సుప్రీంకోర్టు తెలిపినా అతని భవితవ్యంపై ఇంకా నీలి నీడలు మాత్రం వదల్లేదు. దీంతో శరద్ పవార్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 నుంచి 2008 వరకూ బీసీసీఐ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవం శరద్ పవార్ కు ఉండటంతో అది తనకు అనుకూలంగా మార్చుకునేందుకే యత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగానే కోర్టు నిర్ణయంపై శ్రీనివాస్ స్పందించే తీరును పరిశీలించాకే తన నిర్ణయాన్ని పవార్ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం ఫిబ్రవరి 14 వరకూ వేచి చూడాలని పవార్ యోచి చూస్తున్నారు. జనవరి 22 వ తీర్పులో సుప్రీంకోర్టు మరో ఆరు వారాల్లో బీసీసీఐ ఎన్నికల జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు మహామహులు అంతా ఆ పనిలో పడ్డారు. -
'బీసీసీఐ ఎన్నికలను వాయిదా వేయండి'
-
'బీసీసీఐ ఎన్నికలను వాయిదా వేయండి'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జనవరి నెలాఖరు వరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ బీసీసీఐకి సూచించింది. డిసెంబర్ 17న జరగాల్సిన బీసీసీఐ సర్వ సభ్య సమావేశాన్ని కూడా వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్నికల్లో పోటీ చేస్తా: శ్రీనివాసన్
బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు. బోర్డు ఎన్నికల నిర్వహణకు, శ్రీనివాసన్పోటీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. కాగా ఎన్నికల్లో గెలుపొందినా పదవికి దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసుకు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించేవరకు బోర్డు పదవులకు దూరంగా ఉండాలన సుప్రీం కోర్టు షరతు విధించింది. కాగా బోర్డు ఎన్నికలు ఆదివారం చెన్నైలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు కోర్టు అభ్యంతర వ్యక్తం చేయలేదని శ్రీనివాసన్ చెప్పారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ రాకెట్ అనంతరం బోర్డు అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగిన శ్రీని మరో సారి ఎన్నికయ్యేందుకు మద్దతు కూడగడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల క్రికెట్ సంఘాలు మద్దతిచ్చే అవకాశముంది.