
హోరాహోరీ...ఉత్కంఠ...
ఆసక్తికరంగా జరిగిన బీసీసీఐ ఎన్నికలు ఒక్క ఓటుతో కార్యదర్శిగా నెగ్గిన ఠాకూర్ మిగతా పదవులన్నీ శ్రీనివాసన్ వర్గానివే దాల్మియా, గంగరాజు ఏకగ్రీవమే
క్రాస్ ఓటింగ్, అధ్యక్షుడి నిర్ణయాత్మక ఓటు, ఒకే ఓటుతో ఫలితం మార్పు, సంచలన విజయం, చైర్మన్‌పై ఆరోపణలు ...ఇలా క్రికెట్ మ్యాచ్‌ను తలపించేలా అన్ని మలుపులతో బీసీసీఐ ఎన్నికలు జరిగాయి. ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని భావించినా.... కొన్ని ప్రధాన పదవుల కోసం హోరాహోరీగా పోరు సాగింది. అతి ముఖ్యమైన కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికలో అనురాగ్ ఠాకూర్ ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రస్తుత కార్యదర్శి సంజయ్ పటేల్‌ను ఓడించారు.
సాక్షి, చెన్నై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన తన ప్రత్యర్థి సంజయ్ పటేల్‌పై ఒక ఓటు తేడాతో నెగ్గారు. పటేల్, శ్రీనివాసన్‌కు ఆత్మీయుడు కాగా, ఠాకూర్‌ను పవార్ వర్గం బలపరిచింది. అయితే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన ఠాకూర్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఇది మినహా అంతటా శ్రీని వర్గం ఆధిపత్యం కనిపించింది. మరో వైపు అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు ఆయన పేరును ప్రతిపాదించగా.... అటు శ్రీనివాసన్, ఇటు పవార్ వర్గీయులు మొత్తం దాల్మియాకు మద్దతుగా నిలిచారు.
సంయుక్త కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికలో అమితాబ్ చౌదరి, చేతన్ దేశాయ్ మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. వీరిద్దరికి సమంగా ఓట్లు వచ్చాయి. దాంతో అధ్యక్ష స్థానంలో ఉన్న శివలాల్ తన నిర్ణయాత్మక ఓటు అమితాబ్‌కు వేసి గెలిపించారు.
ఐదు ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురు... గోకరాజు గంగరాజు (ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి-సౌత్‌జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్), నెహ్రూ (నార్త్) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
సెంట్రల్ జోన్ తరఫున సీకే ఖన్నా ఎన్నికయ్యారు. పవార్ బలపరిచిన జ్యోతిరాదిత్య సింథియాపై ఆయన సంచలన విజయం సాధించడం విశేషం. వెస్ట్ తరఫున రవిసావంత్‌ను ఓడించి టీసీ మ్యాథ్యూ ఉపాధ్యక్షుడయ్యారు.
బోర్డులో సుదీర్ఘ కాలంగా ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్న రాజీవ్‌శుక్లాకు కూడా ఓటమి ఎదురైంది. కోశాధికారి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో అనిరుధ్ చౌదరి... శుక్లాపై గెలుపొందారు.
ఐసీసీ సీఈ సమావేశాల్లో ఇకపై ఠాకూర్ బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తారని ఏజీఎంలో ఖరారు చేశారు.
సందీప్ పాటిల్ నేతృత్వంలోని ప్రస్తుత క్రికెట్ సెలక్షన్ కమిటీ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పెంచుతూ కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
శివలాల్‌పై ఆరోపణలు: ఏజీఎంకు అధ్యక్షత వహించిన శివలాల్ యాదవ్ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. బరోడా సంఘం తరఫున రాకేశ్ పారిఖ్‌ను అనర్హతకు గురి చేస్తూ... సమర్జిత్ గైక్వాడ్‌కు ఓటింగ్ అవకాశం ఇవ్వడాన్ని కొందరు తప్పుపట్టారు. ఉపాధ్యక్షుడిగా పోటీచేసి ఓడిన రవిసావంత్ ఈ వివాదంపై మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.
బీసీసీఐ కొత్త కార్యవర్గం
అధ్యక్షుడు: జగ్మోహన్ దాల్మియా
కార్యదర్శి: అనురాగ్ ఠాకూర్
సంయుక్త కార్యదర్శి: అమితాబ్ చౌదరి
కోశాధికారి: అనిరుధ్ చౌదరి
ఉపాధ్యక్షులు: ఎంఎల్ నెహ్రూ (నార్త్), గోకరాజు గంగరాజు (సౌత్), గౌతమ్ రాయ్ (ఈస్ట్), టీసీ మ్యాథ్యూ (వెస్ట్), సీకే ఖన్నా (సెంట్రల్).
బీసీసీఐ ఎన్నికలు, అనురాగ్ ఠాకూర్, శ్రీనివాసన్,