
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం విధితమే. చాలామంది ప్రస్తుత కార్యదర్శి జై షా బీసీసీఐ కొత్త బాస్ అవుతాడని.. బీసీసీఐ సారధి సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడని భావించగా.. తాజాగా అధ్యక్ష పదవి రేసులో కొత్త పేరు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
భారత్ 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు, మాజీ ఆల్‌రౌండర్, భారత మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ పేరు గురువారం బీసీసీఐ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ లో కనిపించింది. బీసీసీఐ నిర్వహించబోయే వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తరఫున రోజర్ బిన్నీ పేరు ఉంది. గతంలో కేఎస్పీఏ తరఫున సంతోష్ మీనన్ సమావేశాలకు హాజరయ్యేవాడు. తాజాగా మీనన్ స్థానంలో బిన్నీ సమావేశాలకు హాజరుకానుండటంతో బీసీసీఐ అధ్యక్ష ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బిన్నీకి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముందు నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన జై షాకు అతని తండ్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశిస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఈ ప్రచారాల సంగతి అటుంచితే.. బీసీసీఐ కొత్త బాస్ ఎవరనేది తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే. బీసీసీఐ అధ్యక్ష పదవి సహా పలు కీలక పోస్టులకు అక్టోబర్ 11, 12 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న పోటీలో ఉన్న సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. అనంతరం అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ.. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment