ఐసీసీకి తేల్చి చెప్పిన బీసీసీఐ
భారత ప్రభుత్వ అనుమతి నిరాకరణ
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్‌లు యూఏఈలో!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై స్పష్టత వచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టు వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. పాక్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చిలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి.
ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డపై తాము క్రికెట్ ఆడలేమని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తెలియజేసింది. తాము పాకిస్తాన్‌కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత బోర్డు సమాచారం అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్‌తో పాటు భారత్‌కు ప్రత్యరి్థగా ఉండే జట్లు కూడా పాక్ వెలుపల ఉండే వేదికలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుది. పాక్‌తో పాటు దేశం బయట మరో వేదికను ఎంచుకొని ‘హైబ్రిడ్ మోడల్’లో టోర్నీని నిర్వహించే ఆలోచనే లేదని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ శుక్రవారం కూడా చెప్పారు. అయితే ఒక్కరోజులో పరిస్థితి అంతా మారిపోయింది.
భారత మ్యాచ్‌లకు యూఏఈ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. తాము సిద్ధమంటూ శ్రీలంక బోర్డు చెబుతున్నా... పాక్ కోణంలో వారికి అనుకూల, సౌకర్యవంతమైన వేదిక కాబట్టి యూఏఈకే మొగ్గు చూపవచ్చు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు వచ్చి ఆడినా... భారత్ మాత్రం అలాంటిదేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడింది. నేటి నుంచి సరిగ్గా 100 రోజుల్లో
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment