శ్రీనివాసన్కు మళ్లీ నిరాశ.. సుప్రీం కోర్టు షరతు
బీసీసీఐ అధ్యక్ష పదవిని మళ్లీ అధిష్టించాలని ఆశిస్తున్న ఎన్.శ్రీనివాసన్కు కాస్త ఉపశమనం కలిగినా నిరీక్షణ మాత్రం తప్పలేదు. ఈ నెల 29న జరిగే బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశానికి, అధ్యక్ష పదవి ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నయ్లో జరిగే ఈ సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అనుమతిచ్చింది. ఐతే బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మరోసారి ఎన్నికయినా బాధ్యతలు చేపట్టరాదని ఆదేశించింది.
బీసీసీఐ ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ బీహార్ క్రికెట్ సంఘం వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్ అల్లుడు, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ టీమ్ ప్రిన్సిపాల్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ దశలో ఉండటంతో పాటు బోర్డు అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ తాత్కలికంగా వైదొలగిన విషయాలను బీహార్ సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ కేసులో తాము తీర్పు వెలువరించే వరకు శ్రీనివాసన్ బోర్డు పదవికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా బోర్డు పగ్గాలు చేపట్టేందుకు శ్రీనివాసన్ వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల మద్దతు కూడగడుతున్నారు.