ధోని స్నేహితుడిని కూడా..
విచారించిన ముద్గల్ కమిటీ
ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ సాగిస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ నివేదికకు తుది రూపునిస్తోంది. ఈ వారాంతంలో కమిటీ ఆ నివేదికను సుప్రీం కోర్టుకు అందించాల్సి ఉంది. దీంట్లో భాగంగా మాజీ క్రీడా ప్రచారకర్త ఆషిమ్ ఖేతర్‌పాల్, కెప్టెన్ ధోని ఎండార్స్‌మెంట్ చూసే అతడి స్నేహితుడు అరుణ్ పాండేలను కమిటీ ప్రశ్నించింది. ‘ధోనితో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఎంత మొత్తాన్ని అతడికి ఆఫర్ చేశారు? ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? అని పాండేను కమిటీ ప్రశ్నించింది.
అలాగే ధోనితో వ్యాపార సంబంధాల గురించి కూడా ఆరా తీశారు. పాండేకు చెందిన రితీ స్పోర్ట్స్‌లో ధోనికి వాటాలున్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఎన్ని కంపెనీలకు ధోని ఎండార్స్ చేస్తున్నాడు.. ఆ కంపెనీలు నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయా అని ప్రశ్నించారు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు అరుణ్ పాండే నిరాకరించారు. మరోవైపు పాండేతో సంబంధాల గురించి తనను కమిటీ ప్రశ్నించిందని ఖేతర్‌పాల్ తెలిపారు. గతంలో మ్యాచ్‌లు ఫిక్స్ చేసేందుకు పలువురు క్రికెటర్లకు డబ్బులు ఆఫర్ చేశారనే ఆరోపణలు ఖేతర్‌పాల్‌పై ఉన్నాయి.