captain mahendra singh dhoni
-
ఐపీఎల్ స్లెడ్జింగ్‌ను దూరం చేసింది: ధోని
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. ‘మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ఉండాలి. నిజానికి ఐపీఎల్ అసహ్యకరమైన స్లెడ్జింగ్‌ను దూరం చేసింది. ఇలాంటి టి20 లీగ్స్ ద్వారా ఆటగాళ్ల మధ్య స్నేహాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్కతుల నేపథ్యం కలిగిన వారంతా ఒక్కచోట కలిసి ఉండడం ఆటగాళ్లకు లాభిస్తోంది. నేను కూడా చాలామంది ఆటగాళ్లకు సన్నిహితంగా మారాను’ అని వెస్టిండీస్ డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తెలిపాడు. -
ధోని వచ్చేశాడు...
బెంగళూరు : జాతీయ క్రికెట్ అకాడమీలో భారత క్రికెట్ జట్టు సందడి మొదలైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో 30 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వన్డే, టి20లకు జట్లకు ఎంపిక కాని క్రికెటర్లు కూడా ఈ ప్రాబబుల్స్ బృందంలో ఉన్నారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా ఉత్సాహంగా కనిపించాడు. టెస్టు కెప్టెన్ కోహ్లి సహా గాయం నుంచి కోలుకుంటున్న ధావన్ కూడా క్యాంప్‌లో చేరాడు. టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు ముగ్గురు సహాయక కోచ్‌ల నేతృత్వంలో ఆటగాళ్లు శిక్షణలో పాల్గొన్నారు. -
బొకారోలో ధోని అకాడమీ
ఆగస్టు 15న ప్రారంభం రాంచీ: చాలా మంది సీనియర్ల బాటలోనే భారత వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇప్పుడు క్రికెట్ కోచింగ్ వైపు మరలుతున్నాడు. తన కల అయిన క్రికెట్ అకాడమీని ఆటగాడిగా ఉండగానే అతను నెరవేర్చుకోబోతున్నాడు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో స్టీల్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బొకారోలో ధోని అకాడమీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆగస్టు 15న ఈ అకాడమీ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ధోనికి చెందిన అర్కా ఫౌండేషన్ ట్రస్ట్, బొకారోలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. పాఠశాల ఆవరణలో ఇది ఏర్పాటవుతుంది. ముందుగా రాంచీ లేదా ధన్‌బాద్‌లలో దీనిని పెట్టాలనుకున్న ధోని చివరకు బొకారో వైపు మొగ్గు చూపాడు. కోచింగ్ సిబ్బందిలో పలువురు మాజీ క్రికెటర్లు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో జార్ఖండ్‌లో మరిన్ని చోట్ల అకాడమీ కార్యకలాపాలను విస్తరించే ఆలోచనలో మహి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. -
ధోని స్నేహితుడిని కూడా..
విచారించిన ముద్గల్ కమిటీ ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై విచారణ సాగిస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ నివేదికకు తుది రూపునిస్తోంది. ఈ వారాంతంలో కమిటీ ఆ నివేదికను సుప్రీం కోర్టుకు అందించాల్సి ఉంది. దీంట్లో భాగంగా మాజీ క్రీడా ప్రచారకర్త ఆషిమ్ ఖేతర్పాల్, కెప్టెన్ ధోని ఎండార్స్మెంట్ చూసే అతడి స్నేహితుడు అరుణ్ పాండేలను కమిటీ ప్రశ్నించింది. ‘ధోనితో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఎంత మొత్తాన్ని అతడికి ఆఫర్ చేశారు? ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? అని పాండేను కమిటీ ప్రశ్నించింది. అలాగే ధోనితో వ్యాపార సంబంధాల గురించి కూడా ఆరా తీశారు. పాండేకు చెందిన రితీ స్పోర్ట్స్‌లో ధోనికి వాటాలున్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఎన్ని కంపెనీలకు ధోని ఎండార్స్ చేస్తున్నాడు.. ఆ కంపెనీలు నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయా అని ప్రశ్నించారు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు అరుణ్ పాండే నిరాకరించారు. మరోవైపు పాండేతో సంబంధాల గురించి తనను కమిటీ ప్రశ్నించిందని ఖేతర్పాల్ తెలిపారు. గతంలో మ్యాచ్‌లు ఫిక్స్ చేసేందుకు పలువురు క్రికెటర్లకు డబ్బులు ఆఫర్ చేశారనే ఆరోపణలు ఖేతర్పాల్పై ఉన్నాయి. -
ఫుట్‌బాల్ జట్టుపై ధోని దృష్టి
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని... ఒక జట్టును కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. భారత్‌లో త్వరలో ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని మహీ భావిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ధోని కలిసి జట్టును కొనే అవకాశం ఉందని లీగ్ వర్గాలు తెలిపాయి. ‘ధోని, జాన్ మంచి స్నేహితులు. ఈ లీగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు జాన్ ఇప్పటికే బాగా ఆసక్తి చూపుతున్నాడు. ధోనితో కలిసి టీమ్ కొనాలని అనుకుంటున్నాడు’ అని లీగ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మార్చి 30 లోపు ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనే జట్ల కోసం సెప్టెంబరులో వేలం నిర్వహిస్తారు. మరోవైపు ఇదే లీగ్‌లో కోల్‌కతా జట్టును కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు షారూఖ్ ఖాన్ గతంలో చెప్పాడు. -
ఈపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని... భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేయనున్నాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌ను భారత్‌లో ప్రమోట్ చేసేందుకు స్టార్‌స్పోర్ట్స్ సంస్థ ధోనితో ఒప్పందం చేసుకుంది. ఈ లీగ్ కోసం చానెల్‌కు మహీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తాడు. వ్యక్తిగతంగా ధోని ఫుట్‌బాల్‌కు వీరాభిమాని. ఈపీఎల్‌లో మాంచెస్టర్ యునెటైడ్ జట్టును ఇష్టపడతాడు. ‘క్రికెట్ లేకపోతే వారాంతాల్లో బీపీఎల్ చూసేందుకు టీవీకి అతుక్కుపోతాను. దేశంలో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువ. అదే సమయంలో ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్‌బాల్‌లో నేను గోల్‌కీపర్‌ని’ అని ధోని చెప్పాడు. ఈ సీజన్ నుంచి స్టార్‌స్పోర్ట్స్ ఈపీఎల్‌కు హిందీ కామెంటరీ కూడా అందించనుంది. -
ధోని చిట్కాలు లాభించాయి
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌లో కెప్టెన్ ఎం.ఎస్. ధోని నుంచి నేర్చుకున్న చిట్కాలు... జింబాబ్వే పర్యటనలో భారత జట్టును నడిపించేందుకు చాలా ఉపయోగపడ్డాయని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ‘ఎంఎస్ ఏ విషయాన్ని ఎక్కువగా చెప్పడు. అయితే రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు అతనితో మాట్లాడే వాణ్ని. జట్టు కు సారథ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, అందుకు తాను ఏం చేయాలో తెలుసుకునేవాణ్ని. విండీస్‌లో నేను జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అతనితో ఇలాంటి విషయాలు చాలా మాట్లాడాను. అతను ఇచ్చిన చిట్కాలు నిజంగా చాలా ఉపకరించాయి’ అని తనపై ధోని నాయకత్వ ప్రభావం ఏ మేరకు ఉందో వెల్లడించాడు. జింబాబ్వేలో సిరీస్ గెలిచిన తర్వాత ధోనితో మాట్లాడలేదన్నాడు. ‘సెలవుల కోసం మహి బయటకు వెళ్లినప్పుడు అతన్ని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం. ఫోన్లో మెసేజ్ పెట్టేందుకు ప్రయత్నించా. కానీ అతనికి చేరలేదు. జింబాబ్వే సిరీస్ గురించి త్వరలోనే ధోనితో మాట్లాడతా’ అని ఇక్కడ జరిగిన ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న స్పిన్నర్ రవీంద్ర జడేజాపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. నిలకడగా రాణించడంతో ఇది సాధ్యమైందన్నాడు. ‘టాప్ ర్యాంక్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా అతను చాలా కఠినంగా శ్రమిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో నా కెప్టెన్సీలో ఆడాడు. మంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. భవిష్యత్‌లో కూడా ఇలాగే రాణిస్తాడని ఆశిస్తున్నా’ అని ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. పెద్ద సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా తీసుకోవాలో భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా పర్యటనలో తెలుస్తుందన్నాడు. ‘క్రికెటర్లకు ఎమర్జింగ్ టోర్నీ చాలా ప్రధానమైంది. 2009లో జరిగిన ఈ టోర్నీ వల్లే నేను పునరాగమనం చేయగలిగా. ఈ టోర్నీలో గట్టి పోటీ ఉంటుంది. మెరుగ్గా రాణించేందుకు ప్రతి ఆటగాడు మైదానంలో వంద శాతం కష్టపడతాడు’ అని కోహ్లి వివరించాడు.