ధోని చిట్కాలు లాభించాయి
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌లో కెప్టెన్ ఎం.ఎస్. ధోని నుంచి నేర్చుకున్న చిట్కాలు... జింబాబ్వే పర్యటనలో భారత జట్టును నడిపించేందుకు చాలా ఉపయోగపడ్డాయని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ‘ఎంఎస్ ఏ విషయాన్ని ఎక్కువగా చెప్పడు. అయితే రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు అతనితో మాట్లాడే వాణ్ని. జట్టు కు సారథ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, అందుకు తాను ఏం చేయాలో తెలుసుకునేవాణ్ని. విండీస్‌లో నేను జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అతనితో ఇలాంటి విషయాలు చాలా మాట్లాడాను. అతను ఇచ్చిన చిట్కాలు నిజంగా చాలా ఉపకరించాయి’ అని తనపై ధోని నాయకత్వ ప్రభావం ఏ మేరకు ఉందో వెల్లడించాడు. జింబాబ్వేలో సిరీస్ గెలిచిన తర్వాత ధోనితో మాట్లాడలేదన్నాడు. ‘సెలవుల కోసం మహి బయటకు వెళ్లినప్పుడు అతన్ని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం. ఫోన్‌లో మెసేజ్ పెట్టేందుకు ప్రయత్నించా.
కానీ అతనికి చేరలేదు. జింబాబ్వే సిరీస్ గురించి త్వరలోనే ధోనితో మాట్లాడతా’ అని ఇక్కడ జరిగిన ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న స్పిన్నర్ రవీంద్ర జడేజాపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. నిలకడగా రాణించడంతో ఇది సాధ్యమైందన్నాడు. ‘టాప్ ర్యాంక్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
కొన్నేళ్లుగా అతను చాలా కఠినంగా శ్రమిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో నా కెప్టెన్సీలో ఆడాడు. మంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. భవిష్యత్‌లో కూడా ఇలాగే రాణిస్తాడని ఆశిస్తున్నా’ అని ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. పెద్ద సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా తీసుకోవాలో భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా పర్యటనలో తెలుస్తుందన్నాడు. ‘క్రికెటర్లకు ఎమర్జింగ్ టోర్నీ చాలా ప్రధానమైంది. 2009లో జరిగిన ఈ టోర్నీ వల్లే నేను పునరాగమనం చేయగలిగా. ఈ టోర్నీలో గట్టి పోటీ ఉంటుంది. మెరుగ్గా రాణించేందుకు ప్రతి ఆటగాడు మైదానంలో వంద శాతం కష్టపడతాడు’ అని కోహ్లి వివరించాడు.