విరాట్ కోహ్లికి రెస్ట్ అందుకే
ముంబై:భారత క్రికెట్ జట్టు ఫిజియో థెరపిస్ట్ పాట్రిక్ ఫార్హార్ట్ సూచన మేరకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి జింబాబ్వే టూర్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. త్వరలో వెస్టిండీస్తో ప్రధానమైన టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని ఫిజియో థెరపిస్ట్ సూచించారన్నారు. దీంతో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ముగిశాక ఆరంభమయ్యే జింబాబ్వే టూర్ నుంచి కోహ్లిని విశ్రాంతి కల్పించినట్లు సందీప్ పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లి నాలుగు సెంచరీలు నమోదు చేసి సరికొత్త ఫీట్ ను సృష్టించాడు. ఐపీఎల్ లీగ్ దశలో 919 పరుగులతో ఎవరకీ అందనంత ఎత్తులో ఉన్న కోహ్లి.. రాయల్ చాలెంజర్స్ ను ప్లే ఆఫ్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్లకు జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. జింబాబ్వే పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 16 మందితో కూడిన భారత వన్డే, టి-జట్టును సోమవారం ప్రకటించారు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్లను ఆడనుంది.
ఇక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత్ టెస్టు జట్టును కూడా ఇదే రోజు ప్రకటించారు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లీ విండీస్ పర్యటనలో టెస్టు జట్టుకు సారథ్యం వహించనున్నాడు. పేసర్ శార్దుల్ ఠాకూర్కు భారత టెస్టు జట్టులో తొలిసారి చోటు లభించగా, మహ్మద్ షమీకి మళ్లీ అవకాశం దక్కింది. కోహ్లీ సారథ్యంలో 17 మందితో కూడిన టెస్టు జట్టును ఎంపిక చేశారు. జూలైలో విండీస్తో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ను ఆడనుంది.