వెంటనే కోహ్లీకి మెస్సేజ్ చేశాను!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్లలో యుజువేంద్ర చాహల్ ఒకడు. 2015 సీజన్లో 23 వికెట్లు, 2016లో 21 వికెట్లు తీసి జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా జెర్సీ ధరించాలన్నది తన కల అని, నేటితో తన కల తీరనుందన్నాడు. హరారేలో నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే ఆడనుంది. అయితే టీమిండియాకు సెలక్ట్ అయ్యాయని తెలిసినప్పుడు విరాట్ కోహ్లీకి మెస్సేజ్ చేసి సంతోషాన్ని పంచుకున్నానని చెప్పాడు. కోహ్లీ తనను అభినందించాడని ఆ క్షణాలను గుర్తుచేసుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో చాహల్ కొనసాగుతున్నాడు.
తాను టీమిండియాకు సెలెక్ట్ అవ్వడం ఐపీఎల్ చలవే అంటున్నాడు. తన బౌలింగ్ లో ఆటగాళ్లు భారీ సిక్సర్లు బాదినా కెప్టెన్ ఒక్కమాట కూడా అనేవాడు కాదని, అది కోహ్లీ తనపై ఉంచిన నమ్మకం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి భీకర ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్లలో బౌలింగ్ చేయడంతో మెరుగయ్యాయని లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. వారు హార్డ్ హిట్టర్స్ కనుక అందుకే వారికి ప్లాన్ ప్రకారం కచ్చితమైన అన్ అండ్ లెన్త్, ఫుల్ టాస్ బంతులు వేసేవాడినని చెప్పాడు. డివిలియర్స్, కోహ్లీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని యువ ఆటగాళ్లతో జింబాబ్వేపై సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాడు.