
దానికి మరేది సాటిరాదన్న విరాట్ కోహ్లి
ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని వ్యాఖ్య
ఆటను ఆస్వాదించినంత కాలం కొనసాగుతానని వెల్లడి
బెంగళూరు: ఒక క్రికెటర్‌గా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోగలిగితే అది ఎంతో ప్రత్యేకం అవుతుందని, దానికి మరేదీ సాటి రాదని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1900 తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా కీలక పాత్ర పోషించిందని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
‘ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే ఎంతో బాగుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగమయ్యే స్థాయికి తెచి్చంది. ఇది యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం. ప్రతి అథ్లెట్ దాని కోసమే కష్టపడతాడు. పురుషుల, మహిళల విభాగాల్లో మన జట్టు పతకానికి చేరువవుతుందని అనుకుంటున్నా’ అని విరాట్ అన్నాడు.
ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన కోహ్లి... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు కెరీర్ కొనసాగిస్తాడా అనేది చూడాలి. 2028కి విరాట్ 40వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ‘ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఒకవేళ ఒలింపిక్ పసిడి పతకం కోసం మ్యాచ్ ఆడుతుంటే... నేను గుట్టు చప్పుడు కాకుండా జట్టులో చేరి పతకం సాధించి ఇంటికి వస్తా’ అని విరాట్ చమత్కరించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివిధ అంశాలపై విరాట్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే...
» మహిళల ప్రీమియర్ లీగ్ వల్ల దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటోంది.
» ఆరేడేళ్ల క్రితం మహిళల ఆటకు ఇంత ప్రాధాన్యత దక్కలేదు. డబ్ల్యూపీఎల్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వారి గురించి చర్చ జరుగుతోంది. రోజు రోజుకు ఆటలో ప్రమాణాలు పెరుగుతున్నాయి.
» వేరే రంగాల్లో విజయం సాధించినప్పుడు రాని పేరు, ప్రఖ్యాతలు క్రీడల్లో సులువుగా వస్తాయి. ఎందుకంటే మైదానంలో ఆడేది తామే అని ప్రతి ఒక్క అభిమాని ఊహించుకుంటాడు కాబట్టే ఇది సాధ్యం. అందుకే క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది.
» ఆటను ఆస్వాదించడం నాకు ఇష్టం... అదే చేస్తున్నా. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం లేదు. మైదానంలో వంద శాతం కష్టపడటం అలవాటు. దాన్ని ఇక మీద కూడా కొనసాగిస్తా. భావోద్వేగాలు ఆటలో భాగం. వాటిని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించను.
» ఆటలో పోటీ సహజం. అప్పుడే మన సహజ నైపుణ్యం బయటకు వస్తుంది. ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకేదో గుర్తింపు పొందాలనుకోవడం లేదు. ఆటపై ప్రేమ ఉన్నంతకాలం మైదానంలో కొనసాగుతా. ఈ అంశంలో రాహుల్ ద్రవిడ్ విలువైన సూచనలిచ్చారు. ‘‘నీతో నువ్వు తరచూ మాట్లాడుతూ ఉండు ఎప్పుడు ఆపేయాలో నీకే తెలుస్తుంది’’ అన్నారు. దాన్నే పాటిస్తున్నా.
» జీవితంలో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా. కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే సుదీర్ఘ అనుభవం సాధించిన తర్వాత అన్నీ విషయాలను అనుకున్న విధంగా పూర్తి చేయడం కష్టం. వయసు పెరుగుతున్న భావన కలగడం సహజం. ఫిట్‌గా ఉండేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది.
» అప్పుడప్పుడు అసంతృప్తి ఆవరిస్తుంది. నా వరకు ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా.. అయితే దాన్ని ఒత్తిడిగా భావించలేదు. అందులో నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించి వాటిపై కసరత్తు చేసి ఫలితాలు సాధించా. 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించాల్సిందే. మరో అవకాశం వచ్చినప్పుడు దాన్ని మరింపిచే ప్రదర్శన చేయాలి. 2018లో నేను అదే చేశా.
» క్రికెటేతర విషయాల గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోను. డ్రెస్సింగ్ రూమ్ బయటి వ్యాఖ్యలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. ఒక్కసారి వాటిని పట్టించుకోవడం ప్రారంభిస్తే ఇక ఒత్తిడి కొండలా పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment