బొకారోలో ధోని అకాడమీ
ఆగస్టు 15న ప్రారంభం
రాంచీ: చాలా మంది సీనియర్ల బాటలోనే భారత వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇప్పుడు క్రికెట్ కోచింగ్ వైపు మరలుతున్నాడు. తన కల అయిన క్రికెట్ అకాడమీని ఆటగాడిగా ఉండగానే అతను నెరవేర్చుకోబోతున్నాడు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో స్టీల్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బొకారోలో ధోని అకాడమీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆగస్టు 15న ఈ అకాడమీ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ధోనికి చెందిన అర్కా ఫౌండేషన్ ట్రస్ట్, బొకారోలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. పాఠశాల ఆవరణలో ఇది ఏర్పాటవుతుంది. ముందుగా రాంచీ లేదా ధన్‌బాద్‌లలో దీనిని పెట్టాలనుకున్న ధోని చివరకు బొకారో వైపు మొగ్గు చూపాడు. కోచింగ్ సిబ్బందిలో పలువురు మాజీ క్రికెటర్లు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో జార్ఖండ్‌లో మరిన్ని చోట్ల అకాడమీ కార్యకలాపాలను విస్తరించే ఆలోచనలో మహి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.