కెరీర్‌లో తన చివరి మ్యాచ్ ఆడిన అనంతరం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భార్య నటాషా, చిన్న కూతురు అనైజాలతో గంభీర్
న్యూఢిల్లీ: రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (టి20, వన్డే)లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లాడిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆటకు తెరపడింది. ఇటీవలే అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు బైబై చెప్పాడు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తల్ని 37 ఏళ్ల గంభీర్ కొట్టిపారేశాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అవన్నీ వదంతులే.
నేను ట్విట్టర్ వేదికగా సామాజిక, వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా స్పందించడం వల్లే బహుశా కొందరు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుకోవచ్చు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. నేను ఏ పార్టీలో చేరను, ఎన్నికల్లో పోటీ చేయను. నాకు క్రికెట్‌లోనే సుదీర్ఘ అనుభవం ఉంది. రాజకీయాలనేవి పూర్తిగా భిన్నం. ఆటతో అనుబంధం కొనసాగించాలంటే క్రికెట్ వ్యాఖ్యాతగా ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ చేయడం మాత్రమే కాదనేది నా అభిప్రాయం. నేనో ముక్కుసూటి మనిషిని. నన్నెవరూ క్రికెట్ సంఘంలో సభ్యుడిగా కోరుకోరు. కోచింగ్‌పై మాత్రం ఆసక్తి ఉంది. కొంత విశ్రాంతి తర్వాత యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతా’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment