cricket coaching
-
క్రికెట్ లెర్నింగ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించిన వీరేంద్రుడు
న్యూఢిల్లీ: భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ CRICURUని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి అతను ఈ వెబ్‌సైట్‌ని బుధవారం లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి భారత్‌లో ఇదే మొట్టమొదటి వెబ్సైట్ అని పేర్కొన్నాడు. ఈ వెబ్సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించాడు. CRICURU సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్‌ఫర్ట్‌లతో తమ యూజర్లకు శిక్షణ ఇప్పిస్తామని, తామిచ్చే కోచింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుందని వివరించాడు. ఈ సందర్భంగా వెబ్సైట్ కో ఫౌండర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రికెటర్లకి కోచింగ్ అందించడమే తమ లక్ష్యమని, ఇంట్లో కూర్చోనే సౌకర్యంగా కోచింగ్ తీసుకునే వెసలుబాటును తమ వెబ్సైట్ కల్పిస్తుందని, ఇందుకు కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలని వివరించాడు. ఈ వెబ్సైట్లో కోచింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ల ఇంటర్వ్యూలు కూడా ఉండనున్నాయని, అలాగే కోచింగ్ క్లాస్‌లను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నాడు. తమతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు www.cricuru.comకి వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ వెబ్సైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.299 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. చదవండి: టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం.. -
రాజకీయాల్లోకి రాను!
న్యూఢిల్లీ: రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (టి20, వన్డే)లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లాడిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆటకు తెరపడింది. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు బైబై చెప్పాడు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తల్ని 37 ఏళ్ల గంభీర్ కొట్టిపారేశాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అవన్నీ వదంతులే. నేను ట్విట్టర్ వేదికగా సామాజిక, వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా స్పందించడం వల్లే బహుశా కొందరు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుకోవచ్చు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. నేను ఏ పార్టీలో చేరను, ఎన్నికల్లో పోటీ చేయను. నాకు క్రికెట్లోనే సుదీర్ఘ అనుభవం ఉంది. రాజకీయాలనేవి పూర్తిగా భిన్నం. ఆటతో అనుబంధం కొనసాగించాలంటే క్రికెట్ వ్యాఖ్యాతగా ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ చేయడం మాత్రమే కాదనేది నా అభిప్రాయం. నేనో ముక్కుసూటి మనిషిని. నన్నెవరూ క్రికెట్ సంఘంలో సభ్యుడిగా కోరుకోరు. కోచింగ్‌పై మాత్రం ఆసక్తి ఉంది. కొంత విశ్రాంతి తర్వాత యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతా’ అని అన్నాడు. -
బొకారోలో ధోని అకాడమీ
ఆగస్టు 15న ప్రారంభం రాంచీ: చాలా మంది సీనియర్ల బాటలోనే భారత వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇప్పుడు క్రికెట్ కోచింగ్ వైపు మరలుతున్నాడు. తన కల అయిన క్రికెట్ అకాడమీని ఆటగాడిగా ఉండగానే అతను నెరవేర్చుకోబోతున్నాడు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో స్టీల్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బొకారోలో ధోని అకాడమీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆగస్టు 15న ఈ అకాడమీ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ధోనికి చెందిన అర్కా ఫౌండేషన్ ట్రస్ట్, బొకారోలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. పాఠశాల ఆవరణలో ఇది ఏర్పాటవుతుంది. ముందుగా రాంచీ లేదా ధన్‌బాద్‌లలో దీనిని పెట్టాలనుకున్న ధోని చివరకు బొకారో వైపు మొగ్గు చూపాడు. కోచింగ్ సిబ్బందిలో పలువురు మాజీ క్రికెటర్లు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో జార్ఖండ్‌లో మరిన్ని చోట్ల అకాడమీ కార్యకలాపాలను విస్తరించే ఆలోచనలో మహి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. -
క్రికెట్లో కోచింగ్ పాత్ర పెరిగింది
మాదాపూర్, న్యూస్‌లైన్: ప్రస్తుతం క్రికెట్లో అవకాశాలతో పాటు పోటీ కూడా పెరిగిందని, ఈ స్థితిలో చక్కటి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే నిలబడగలరని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డారు. అందుకోసం వ్యక్తిగత కోచింగ్ కీలకంగా మారిందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడి ట్రియంప్ అకాడమీలో రాజూస్ క్రికెట్ క్లబ్లో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గతంలో క్రికెట్లో శిక్షణకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా స్పష్టత ఉండకపోయేది. కోచ్‌లు కూడా ఆటకంటే క్రమశిక్షణవంటి విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. అయితే ఇప్పుడు క్రికెట్లో పోటీతో పరిస్థితి మారింది’ అని కిర్మాణీ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆయన చెప్పారు. ‘ఎప్పటికప్పుడు క్రికెటర్లు తమ ఆటకు పదును పెట్టాలి. ఎంత బాగా ఆడుతున్నా మరింతగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. పైగా ఒక టోర్నీలో పరుగులు సాధించడం గొప్ప విషయం కాదు. నిలకడగా ఆడితేనే కుర్రాళ్లకు భవిష్యత్తు ఉంటుంది’ అని ఈ దిగ్గజ కీపర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, అంకితభావంతోనే ఇది సాధ్యమని ఆయన అన్నారు. ఇటీవల భారత జట్టు ఎంపిక విషయంలో జాతీయ సెలక్షన్ కమిటీపై తరచూ వివాదాలు వస్తున్నాయని, ప్రతిభ గల ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఇలాంటి ప్రశ్నలు ఎదురు కావని కిర్మాణీ విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో జెమ్ మోటార్స్ చైర్మన్ రాజు యాదవ్, క్రికెట్ క్లబ్ నిర్వాహకులు రాజు, ట్రియంప్ స్పోర్ట్స్ సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.