న్యూఢిల్లీ: భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్‌సైట్ CRICURUని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి అతను ఈ వెబ్‌సైట్‌ని బుధవారం లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి భారత్‌లో ఇదే మొట్టమొదటి వెబ్‌సైట్ అని పేర్కొన్నాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించాడు.
CRICURU సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్‌ఫర్ట్‌లతో తమ యూజర్లకు శిక్షణ ఇప్పిస్తామని, తామిచ్చే కోచింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుందని వివరించాడు. ఈ సందర్భంగా వెబ్‌సైట్ కో ఫౌండర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ..
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రికెటర్లకి కోచింగ్ అందించడమే తమ లక్ష్యమని, ఇంట్లో కూర్చోనే సౌకర్యంగా కోచింగ్ తీసుకునే వెసలుబాటును తమ వెబ్‌సైట్ కల్పిస్తుందని, ఇందుకు కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలని వివరించాడు. ఈ వెబ్‌సైట్‌లో కోచింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ల ఇంటర్వ్యూలు కూడా ఉండనున్నాయని, అలాగే కోచింగ్ క్లాస్‌లను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నాడు. తమతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు www.cricuru.comకి వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ వెబ్‌సైట్‌లో ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూ.299 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
చదవండి: టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం..
Comments
Please login to add a commentAdd a comment