
టీమిండియా మాజీ హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ ప్రస్తుత తరంలో తన ఫేవరెట్ వరల్డ్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసిన బాంగర్.. వన్‌డౌన్‌లో కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, జోష్ హజిల్‌వుడ్‌ను ఎంపిక చేశాడు. బాంగర్ తన వరల్డ్ ఫేవరెట్ జట్టులో వరల్డ్ టాప్ టెస్ట్ బ్యాటర్లు జో రూట్, స్టీవ్ స్మిత్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే, రావ్ పోడ్‌కాస్ట్‌తో బాంగర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ ఓ దశలో తనతో టెస్ట్ డబుల్ సెంచరీల గురించి డిస్కస్ చేశాడని చెప్పాడు. అప్పటి వరకు విరాట్ టెస్ట్‌ల్లో ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదని అన్నాడు. అది అతని కెరీర్‌లో వెలితిగా ఉండేదని చెప్పాడు. అయితే విరాట్ డబుల్ సెంచరీలు ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత ఒకే సీజన్‌లో నాలుగైదు డబుల్ సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు.
బ్యాటింగ్‌లో విరాట్ ఓ జీనియస్ అని కొనియాడాడు. అతను పట్టుపట్టాడంటే సాధించే వరకు వదలడని తెలిపాడు. విరాట్‌లా కష్టపడే వారు జట్టులో మరొకరు లేరని ప్రశంసించాడు. అతను జట్టు కోసం ఎంతో చేశాడని అన్నాడు. అతను దూకుడు మనిషే కానీ, అదే చాలా సందర్భాల్లో జట్టు విజయాలకు దోహదపడిందని గుర్తు చేశాడు. విరాట్ విదేశాల్లో రాణించేందుకు ఎక్కువగా ఇష్టపడతాడని తెలిపాడు. జట్టు సభ్యులు కూడా విదేశీ పిచ్‌లపై రాణించాలని విరాట్ కోరుకుంటాడని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment