టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ స్కోర్ చేశాడు. ఆర్యవీర్ ఔట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ (623/5) చేసింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల వద్ద ఉండిన ధన్య నక్రా ఈ రోజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నక్రా 122 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అర్నవ్ బుగ్రా (114) కూడా సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు లంచ్ సమయానికి మేఘాలయ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మంధన్ (32), నర్లెంగ్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు మేఘాలయ ఇంకా 293 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌటైంది.
తండ్రి బాటలోనే తనయుడు
ఆర్యవీర్ సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఎదురుచూడలేదు. ఏ స్కోర్ వద్ద ఉన్న దూకుడే మంత్రంగా ఆడాడు. అందుకే ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ ట్రిపుల్ సెంచరీని లెక్క చేయలేదు. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌లో చాలా సందర్భాల్లో సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు మిస్ అయ్యాడు.
2009లో సెహ్వాగ్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో 293 స్కోర్ వద్ద ఔటయ్యాడు. సెహ్వాగ్ కెరీర్‌లో అప్పటికే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ఇప్పుడిప్పుడే క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతని నుంచి కూడా తండ్రి లాంటి ఇన్నింగ్స్‌లే ఆశించవచ్చు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీతో ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ఆర్యవీర్ 49 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment