ఐపీఎల్ స్లెడ్జింగ్‌ను దూరం చేసింది: ధోని
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. ‘మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ఉండాలి. నిజానికి ఐపీఎల్ అసహ్యకరమైన స్లెడ్జింగ్‌ను దూరం చేసింది. ఇలాంటి టి20 లీగ్స్ ద్వారా ఆటగాళ్ల మధ్య స్నేహాలు పెరుగుతున్నాయి.
ప్రపంచంలోని వివిధ సంస్కతుల నేపథ్యం కలిగిన వారంతా ఒక్కచోట కలిసి ఉండడం ఆటగాళ్లకు లాభిస్తోంది. నేను కూడా చాలామంది ఆటగాళ్లకు సన్నిహితంగా మారాను’ అని వెస్టిండీస్ డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తెలిపాడు.