వెటెల్ ‘హ్యాట్రిక్’ పోల్
ప్రధాన రేసు
మధ్యాహ్నం గం. 2.45 నుంచి
ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం
గత రెండేళ్లుగా తనకు కలిసొచ్చిన ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసు సర్క్యూట్‌లో ముచ్చటగా మూడోసారి సెబాస్టియన్ వెటెల్ దుమ్ము రేపాడు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఆధిపత్యం చెలాయించిన ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్... శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లోనూ అదే జోరును కొనసాగించాడు.
అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన ఈ జర్మన్ డ్రైవర్ వరుసగా మూడోఏడాది ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించనున్న వెటెల్ టాప్-5లో నిలిస్తేచాలు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు.
గ్రేటర్ నోయిడా: ఈ సీజన్‌లో వరుసగా ఆరో టైటిల్ సాధించడమే లక్ష్యంగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ఇండియన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.119 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. క్వాలిఫయింగ్‌లోని మొత్తం మూడు సెషన్స్‌లోనూ వెటెలే అగ్రస్థానంలో నిలిచాడు. 2011లో తొలిసారి మొదలైన ఇండియన్ గ్రాండ్‌ప్రిలో వెటెల్‌కిది వరుసగా మూడో పోల్ పొజిషన్ కావడం విశేషం.
గత రెండేళ్లుగా అతను ‘పోల్ పొజిషన్’ సాధించడమేకాకుండా ప్రధాన రేసులోనూ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసులో వెటెల్ గెలిస్తే ఇండియన్ గ్రాండ్‌ప్రిలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతోపాటు ఈ సీజన్‌లో వరుసగా ఆరు టైటిల్స్‌తో ‘డబుల్ హ్యాట్రిక్’ ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. అంతేకాకుండా వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంటాడు.
ప్రస్తుతం వెటెల్ 297 పాయింట్లతో అగ్రస్థానంలో... ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) 207 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం జరిగే రేసులో వెటెల్ కనీసం టాప్-5లో నిలిస్తే ఈ సీజన్‌లోని మిగతా మూడు రేసుల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమవుతుంది. ఇక సొంతగడ్డపై భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు ఆకట్టుకోలేకపోయారు. పాల్ డి రెస్టా 12వ స్థానం నుంచి... సుటిల్ 13వ స్థానం నుంచి పోటీపడతారు.
అడ్డంకులు సృష్టించొద్దు: మాల్యా
భవిష్యత్‌లో ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసు నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని... రేసు సాఫీగా సాగేందుకు సాధ్యమైనంతగా సహకరించాలని సహారా ఫోర్స్ ఇండియా జట్టు యజమాని విజయ్ మాల్యా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఫార్ములావన్‌కు ప్రభుత్వాల నుంచి లభించే మద్దతు, సహకారం గురించి కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇండియన్ గ్రాండ్‌ప్రి విషయంలో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకూడదు. రేసు నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి’ అని విజయ్ మాల్యా కోరారు.
ఈ వారాంతం అద్భుతంగా ఉంది. కారు పనితీరు బాగుంది. బుద్ధ సర్క్యూట్ నాకెంతో ఇష్టం. సర్క్యూట్ మధ్య భాగం నచ్చింది. వేగాన్ని అందుకునే మలుపులు డ్రైవర్లకు సవాలుగా నిలుస్తాయి. క్వాలిఫయింగ్ ఫలితం జట్టుకు ఉపయోగకరం. ఆదివారం తుది ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. నా దృష్టి అంతా రేసుపైనే. ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గురించి ఆలోచించడంలేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ అదే ప్రశ్న అడుగుతున్నారు. సుదీర్ఘంగా సాగే ఈ రేసులో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో రేసుకు ముందే నిర్ణయిస్తాం.
-వెటెల్