బ్రేక్‌ ముగిసింది... స్టీరింగ్‌ పిలుస్తోంది | 2024 F1 Dutch Grand Prix | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ ముగిసింది... స్టీరింగ్‌ పిలుస్తోంది

Published Sat, Aug 24 2024 8:00 AM | Last Updated on Sat, Aug 24 2024 9:55 AM

2024 F1 Dutch Grand Prix

నేడు డచ్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌

సీజన్‌లో 15వ ఫార్ములావన్‌ రేసుకు అంతా సిద్ధం

సొంతగడ్డపై వరుసగా నాలుగో విజయంపై వెర్‌స్టాపెన్‌ గురి

ఈ సీజన్‌లోని 14 రేసుల్లో ఏడింటిలో గెలిచిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌

గత నాలుగు రేసుల్లో దక్కని విజయం

నోరిస్, లెక్‌లెర్క్, పియాస్ట్రి నుంచి పోటీ  

ఫార్ములావన్‌ సీజన్‌లో వరుసగా ఐదు నెలలపాటు ట్రాక్‌పై రయ్‌..రయ్‌..రయ్‌ మంటూ దూసుకెళ్లిన కార్లకు గత 26 రోజులుగా విరామం లభించింది. విరామం ముగియడంతో మళ్లీ ట్రాక్‌పైకి రావడానికి కార్లు, డ్రైవర్లు సిద్ధమయ్యారు. మొత్తం 24 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 రేసులు ముగిశాయి. 15వ రేసుకు నెదర్లాండ్స్‌లోని జాండ్‌వర్ట్‌ సర్క్యూట్‌ ముస్తాబయింది. శుక్రవారం డ్రైవర్లందరూ ప్రాక్టీస్‌ చేశారు. శనివారం క్వాలిఫయింగ్‌ సెషన్‌ను నిర్వహిస్తారు. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. సీజన్‌లోని తొలి అర్ధభాగంలో డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆధిపత్యం చలాయించి ఏడు రేసుల్లో గెలిచాడు. రెండో భాగంలో మిగిలిన పది రేసుల్లో ఇతర జట్ల డ్రైవర్లు గేర్‌ మార్చి వెర్‌స్టాపెన్‌ దూకుడుకు బ్రేక్‌లు వేస్తారా లేదా వేచి చూడాలి.  

జాండ్‌వర్ట్‌ (నెదర్లాండ్స్‌): గత మూడేళ్లుగా సొంతగడ్డపై రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్, నెదర్లాండ్స్‌ స్టార్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు ఎదురులేదు. స్వదేశంలో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో జోరు మీదున్న వెర్‌స్టాపెన్‌ వరుసగా నాలుగోసారి టైటిల్‌ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్‌ క్యాలెండర్‌లో తిరిగి వచి్చన డచ్‌ గ్రాండ్‌ప్రిలో ఈసారీ గెలిచి అత్యధికసార్లు ఈ రేసు నెగ్గిన జిమ్‌ క్లార్క్‌ సరసన చేరాలని వెర్‌స్టాపెన్‌ భావిస్తున్నాడు. జిమ్‌ క్లార్క్‌ 1963, 1964, 1965, 1967లో డచ్‌ గ్రాండ్‌ప్రి చాంపియన్‌గా నిలవగా.. వెర్‌స్టాపెన్‌ 2021 నుంచి 2023 వరకు మూడేళ్ల పాటు వరుసగా విజయాలు సాధించాడు.

 గత మూడు రేసుల్లోనూ ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రధాన రేసు ప్రారంభించిన 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్‌లో 200వ రేసు కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింటిలో నెగ్గిన వెర్‌స్టాపెన్‌... డ్రైవర్స్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బ్రిటన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) 177 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ 150 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వెర్‌స్టాపెన్‌ అత్యధికంగా తొమ్మిదిసార్లు పోడియంపై (టాప్‌–3) నిలవగా... నోరిస్‌ ఎనిమిదిసార్లు ఆ ఘనత సాధించాడు.  

ట్రాక్‌ ఎలా ఉందంటే! 
ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి అయిన జాండ్‌వర్ట్‌లో ఈ రేసు జరగనుంది. సముద్ర తీరానికి అతి సమీపంలోని రిసార్ట్‌లోని అహ్లాదకర వాతావరణం అటు అభిమానులను, ఇటు రేసర్లను మరింత ఉత్సాహపరచనుంది. అనూహ్య మలుపులు, ఊహించని ఎత్తుపల్లాలతో డ్రైవర్లకు ఈ ట్రాక్‌ సవాలు విసరనుంది.  

72 ల్యాప్‌లు.. 
డచ్‌ గ్రాండ్‌ప్రి సర్క్యూట్‌లో మొత్తం 72 ల్యాప్‌లు ఉన్నాయి. అందులో ఒక్కో ల్యాప్‌ 4.2 కిలోమీటర్లు కాగా... పూర్తి రేసు దూరం 
307 కిలోమీటర్లు.

రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (నెదర్లాండ్స్‌) కెరీర్‌లో ఇది 200వ రేసు. ఫార్ములావన్‌ చరిత్రలో 200 రేసులు పూర్తి చేసుకోనున్న 23వ డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్‌ గుర్తింపు పొందనున్నాడు. 392 రేసులతో ఫెర్నాండో అలోన్సో 
అగ్రస్థానంలో ఉన్నాడు.   

హామిల్టన్‌దే రికార్డు 
డచ్‌ గ్రాండ్‌ప్రిలో అత్యంత వేగంగా ల్యాప్‌ పూర్తి చేసిన రికార్డు బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ పేరిట ఉంది. 2021 రేసులో భాగంగా హామిల్టన్‌ 1 నిమిషం 11.097 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.

సొంతగడ్డపై పోటీ పడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. గత ఏడాది ఇక్కడ పోటీ పడ్డప్పుడు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజేతగా నిలిచా. ఈ సారి ఇంకా ఎక్కువ పోటీ ఉండనుంది. మరింత మెరుగయ్యేందుకు ప్రయతి్నస్తా. 
–వెర్‌స్టాపెన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌

 

నేటి క్వాలిఫయింగ్‌ సెషన్‌ 
సాయంత్రం గం. 6:30 నుంచి 
ఫ్యాన్‌ కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement