
అడిలైడ్: ఇంగ్లండ్ పోరాటం... కెప్టెన్ రూట్ పట్టుదలతో ఉత్కంఠ రేపిన యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు ఫలితం చివరకు ఆస్ట్రేలియా వైపే మొగ్గింది. పేసర్లు మిచెల్ స్టార్క్ (5/88), హాజల్‌వుడ్ (2/49) ధాటికి పర్యాటక జట్టు అయిదో రోజు 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. 354 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ 120 పరుగులతో ‘యాషెస్ తొలి డే నైట్’ టెస్టును గెలుచుకుని సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది.
ఓవర్‌నైట్ స్కోరు 176/4తో బుధవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను హాజల్‌వుడ్ దెబ్బ తీశాడు. రూట్ (67; 9 ఫోర్లు), వోక్స్ (5)లను ఓవర్‌నైట్ స్కోర్ వద్దే అవుట్ చేశాడు. మొయిన్ అలీ (2) విఫలమయ్యాడు. ఓవైపు బెయిర్ స్టో (36; 5 ఫోర్లు) నిల్చున్నా... ఓవర్టన్ (7), బ్రాడ్ (8)లను స్టార్క్ వెనక్కి పంపాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే బెయిర్‌స్టో అవుటయ్యాడు. మూడో టెస్టు ఈనెల 14 నుంచి పెర్త్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment