అబ్బాయిలతో ఆడటమే నా దూకుడుకు కారణం
హైదరాబాద్: అబ్బాయిలతో క్రికెట్ ఆడటమే దూకుడుగా ఆడేలా చేసిందని భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. మహిళా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై చెలరేగిన కౌర్ 7 సిక్సులు, 20 ఫోర్లతో 171 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో అబ్బాయిలతో ఆడుతూ అలవోకగా సిక్సులు కొట్టడం నేర్చుకున్నానని కౌర్ గుర్తు చేసుకుంది. దూకుడుగా ఆడటం అంటే ఇష్టమని ఈ దూకుడైన శైలి చిన్నప్పటి నుంచి సహజంగానే వచ్చిందేనని ఈ వైస్ కెప్టెన్సీ చెప్పుకొచ్చింది.
ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఓటమి నిరాశపరిచిందని, ఫీల్డర్స్ చుట్టుముట్టడంతో పరుగుల కోసం షాట్ ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యానని పేర్కొంది. డొమెస్టిక్ క్రికెట్‌లో దూకుడుగా ఆడటంతోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం వచ్చిందని అయితే పెద్ద స్కోర్లు చేయలేదని కౌర్ చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నా ప్రదర్శన మరిచిపోలేనిదని ఈ మ్యాచ్ ప్రసారం కావడం అందరూ చూడటం మరింత సంతోషాన్ని ఇచ్చిందని కౌర్ ఆనందం వ్యక్తం చేసింది.