'షాయబ్ భాయ్.. మీ మోకా మళ్లీ పోయింది'
న్యూఢిల్లీ: భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైరై హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఓవైపు మైకు ముందు కామెంటరీ చెప్తూనే.. మరోవైపు సందూ దొరికినప్పుల్లా సోషల్ మీడియాలో తన సమకాలీన క్రికెటర్లను ఆటపటిస్తున్నాడు.
తాజాగా ఇలాగే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్‌పై ఓ సున్నితమైన ఛలోక్తి విసిరాడు. సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత్ పాకిస్థాన్ 5-1 గోల్స్ తేడాతో ఓడించగానే ఆయన అఖ్తర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'సారీ షోయబ్ భాయ్. హాకీలో కూడా అవకాశం మీ చేయి జారిపోయింది. భారత్ పాక్‌ను ఓడించింది' అని పేర్కొన్నాడు.
Sorry @shoaib100mph bhai hockey mai bhi mauka haath se nikal gaya #IndBeatsPak pic.twitter.com/xgrPjkTpSX
— Virender Sehwag (@virendersehwag) 12 April 2016
వరల్డ్ కప్‌లో భారత్‌ను పాకిస్థాన్ ఇంతవరకు ఓడించని సంగతి తెలిసిందే. ప్రతి వరల్డ్ కప్ సమయంలో పాక్ అభిమాని ఓడిస్తామనే ఆశతో పటాకులు తెచ్చిపెట్టుకోవడం.. అవి వృథా కావడాన్ని సూచిస్తూ 'మోకా' యాడ్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హాకీలోనూ మీ మోకా (అవకాశం) చేజారిపోయిందంటూ సెహ్వాగ్ ట్వీట్ చేయగా.. క్రీడాస్ఫూర్తితో హాస్యోక్తిని స్వీకరించిన షోయబ్.. 'నా సోదరుడు వీరూ ఏమన్నా అతని క్షమిస్తాను. ఎందుకంటే అతని హృదయం బంగారం. చెడుగా అతనెప్పుడూ మాట్లాడడు. జస్ట్ ఫన్నీ వ్యాఖ్యలు చేస్తాడు' అంటూ బదులిచ్చాడు. క్రికెట్లో భారత్-పాకిస్థాన్ జట్లకు ఏకకాలంలో వీరూ, అఖ్తర్ ప్రాతినిధ్యం వహించారు. వీరి మధ్య సాగిన బ్యాటు-బంతి హోరాహోరీ పోరాటం చాలా సందర్భాల్లో ప్రేకక్షకులను ఉర్రూతలూగించింది.