'ధోనికి హామీ ఇవ్వండి'
న్యూఢిల్లీ: వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఇటీవల వ్యాఖ్యానించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. అందుకు సంబంధించి ధోనికి భరోసా కల్పించాలంటూ జట్టు మేనేజ్మెంట్ కు హితవు పలికాడు. ఆ రకంగా ధోనికి హామీ ఇస్తేనే అతను మరింత స్వేచ్ఛగా ఆడటానికి వీలుంటుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్య్వూలో సెహ్వాగ్ మరోసారి ధోనికి మద్దతుగా నిలిచాడు.
ఒకవేళ ధోని విఫలమైతే అతని స్థానాన్ని భర్తీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సెహ్వాగ్ తిప్పికొట్టాడు. ఎంఎస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదన్నాడు. ధోని స్థానంపై భరోసా కల్పించాల్సింది టీమిండియా సెలక్టర్లేనని విషయం గుర్తుంచుకోవాలన్నాడు.
'భారత జట్టు టాపార్డర్ విఫలమైతే అప్పుడు ధోని ఉపయోగం కచ్చితంగా కనబడుతుంది. భారత టాపార్డర్ లో యువరాజ్, సురేశ్ రైనాల వంటి ఆటగాళ్లు విఫలమైన పక్షంలో ఆ తరువాత వచ్చే ధోని ఆదుకుంటాడు. దాన్ని చాలాసార్లు చూశాం కూడా. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న ధోని స్థానంపై జట్టు యాజమాన్యం భరోసా కల్పించాలి. 2019 వరకూ నీ స్థానం నీదే అనే హామీ ఇచ్చి ధోని మరింత స్వేచ్ఛగా ఆడటానికి దోహద పడండి'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరొకవైపు యువరాజ్, సురేశ్ రైనాల స్థానాన్ని కూడా సెలక్టర్లు పరిశీలించాలని సూచించాడు.