ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. వన్డేల్లో 300 పైగా మ్యాచ్‌లు.. అత్యధిక నాటౌట్‌లు.. స్టంప్ అవుట్‌లతో ఈ ఏడాది రికార్డులు సృష్టించిన ధోని.. టీ 20 క్రికెట్‌లో కూడా తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు. శ్రీలంకతో తొలి టీ20లో 35కు పైగా పరుగులు చేయడంతో పాటు నలుగుర్ని అవుట్ చేయడంలో భాగస్వామ్యమైన ధోని ఆ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు పుస్తకాల్లోకికెక్కాడు. ఓవరాల్‌గా చూస్తే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్, పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సరసన ధోని నిలిచాడు. ఇక రెండో టీ 20లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన ధోని.. రెండు స్టంపింగ్స్ చేశాడు.
ఇప్పుడు లంకేయులతో జరిగే మూడో టీ20లో ధోని రెండు రికార్డులకు చేరువగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లను పడితే అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్‌లో 50 క్యాచ్‌లను పట్టిన తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధిస్తాడు. అదే సమయంలో మూడు స్టంపింగ్‌లు చేస్తే అత్యధిక స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పాకిస్తాన్ కీపర్ కమ్రాన్ అక్మల్ సరసన చేరతాడు. అంతర్జాతీయ టీ 20ల్లో ధోని ఇప్పటివరకూ పట్టిన క్యాచ్‌లు 47 కాగా, స్టంపింగ్‌లు 29 ఉన్నాయి. ఇక్కడ క్యాచ్‌లు విషయంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ధోనికి స్టంపింగ్స్ విషయంలో కమ్రాన్ కంటే వెనుకబడి ఉన‍్నాడు. ప్రస్తుతం టీ 20 ఫార్మాట్‌లో అక్మల్ 32 స్టంపింగ్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. గత మ్యాచ్‌లో ధోని రెండు స్టంపింగ్‌లతో అక్మల్‌కు చేరువగా వచ్చాడు. మరి ధోని 50 క్యాచ్‌లు రికార్డును అందుకుంటాడా?లేక స్టంపింగ్‌ల ఘనతను సాధిస్తాడా? అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment