కటక్:శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టీ 20లో విజయం సాధించడం ద్వారా టీమిండియా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ టీ 20 చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్‌లో టీమిండియా విజయాలు-పరాజయాలు రేషియో 1.61గా నమోదైంది. తద్వారా టెస్టు హోదా కల్గిన జట్ల పరంగా చూస్తే పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. గడిచిన రెండేళ్లలో టీమిండియా 32 టీ 20 మ్యాచ్‌లు ఆడగా, 22 విజయాల్ని ఖాతాలో వేసుకుంది. దాంతో తన సక్సెస్ రేషియోను టీమిండియా మరింత పెంచుకని టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఇప్పటివరకూ టీమిండియా 89 టీ 20 మ్యాచ్‌ల్లో పాల్గొనగా, 53 విజయాల్ని నమోదు చేసింది. ఇక 33 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, ఒకటి టై అయ్యింది. మరో రెండు మ్యాచ్‌ల్లో రద్దయ్యాయి. ఇక్కడ టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ విజయాలు-పరాజయాలు రేషియో 1.60గా ఉంది.
లంకేయులతో తొలి టీ 20లో టీమిండియా 93 పరుగుల తేడాతో భారీ గెలుపుని అందుకుని ఈ ఫార్మాట్‌లో పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్ చేసిన శ్రీలంక 87 పరుగులకే ఆలౌటయ్యారు.
అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా సాధించడం ద్వారా ఓ రికార్డును ఖాతాలో వేసుకుంది. విశాఖలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ రికార్డును నమోదు చేసింది. లంకేయులతో ఆఖరి వన్డేలో విజయంతో ఎనిమిది వరుస సిరీస్ విజయాల్ని భారత్ సొంతం చేసుకోవడంతో పాటు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డేల్లో విజయంతో ఆల్ టైమ్ బెస్ట్ రికార్డును సాధించింది. ఈ ఏడాది టీమిండియా 29 వన్డేలకు గాను 21 మ్యాచ్‌ల్లో విజయంగా సాధించగా, 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరొక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దాంతో ఈ ఏడాది టీమిండియా గెలుపు-పరాజయాల రేషియో 3.000గా నమోదైంది. వన్డే ఫార్మాట్‌లో ఇదే భారత్‌కు ఆల్ టైమ్ బెస్ట్ రికార్డు.
Comments
Please login to add a commentAdd a comment