సెరెనా అరుదైన రికార్డు
శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 3-6, 6-4, 6-2తో మాజీ నంబర్‌వన్, 27వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో సెరెనా అరుదైన రికార్డును సృష్టిం చింది. ఓపెన్ శకంలో (1969 తర్వాత) ప్రతి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లో కనీసం 50 మ్యాచ్‌ల్లో నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గతంలో మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, స్టెఫీ గ్రాఫ్ మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 68, ఫ్రెంచ్ ఓపెన్‌లో 50, వింబుల్డన్‌లో 72, యూఎస్ ఓపెన్‌లో 79 మ్యాచ్‌ల్లో గెలిచింది.
అజరెంకాతో జరిగినమ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్‌లో 2-4తో వెనుకబడిన సెరెనా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా నాలుగు గేమ్‌లు సాధించి రెండో సెట్‌ను 6-4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో సెరెనా దూకుడుగా ఆడి అజరెంకా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 41 విన్నర్స్ కొట్టిన ఈ అమెరికా స్టార్ 21 అనవసర తప్పిదాలు చేసింది. ఓవరాల్‌గా అజరెంకాపై సెరెనాకిది 16వ గెలుపుకాగా... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ సెరెనానే విజయం వరించింది.