సెరెనాదే టైటిల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్ పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా మొత్తం 69 పాయింట్లు సాధించగా, వీనస్ 59 పాయింట్లను మాత్రమే సాధించింది. సుమారు గంటా ముఫ్పై నిమిషాలు పాటు జరిగిన ఫైనల్లో సెరెనా 10 ఏస్లను సంధించగా, వీనస్ 7 ఏస్లకు మాత్రమే పరిమితమైంది. ఆది నుంచి తన జోరును కొనసాగించిన సెరెనా ఏ దశలోనూ వీనస్ ను తేరుకునే అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను కైవసం చేసుకుంది.
తద్వారా ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే జర్మనీ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్(22 గ్రాండ్ స్లామ్) పేరిట ఉన్న రికార్డును సెరెనా సవరించింది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్లో సెమీ ఫైనల్లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ లో సెరెనా ఆద్యంతం తన జోరును కొనసాగించి టైటిల్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. ఇది సెరెనాకు ఏడో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్.