సెరెనా ‘డబుల్’
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన కొన్ని గంటలకే అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. తన అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి సెరెనా మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సెరెనావీనస్ ద్వయం 6-3, 6-4తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై గెలిచింది. సెరెనా-వీనస్ జంటకిది 14వ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. సెరెనా ఒకే ఏడాది వింబుల్డన్‌లో సింగిల్స్‌తోపాటు డబుల్స్ టైటిల్‌ను నెగ్గడం ఇది నాలుగోసారి (2002, 2009, 2012, 2016).
* మార్టినా నవ్రతిలోవా-పామ్ ష్రైవర్ జంట (20 టైటిల్స్) తర్వాత ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జోడీగా సెరెనా-వీనస్ గుర్తింపు పొందింది.
* తమ కెరీర్‌లో డబుల్స్ విభాగంలో 23 సార్లు ఫైనల్‌కు చేరుకున్న సెరెనా-వీనస్ జంట 22 సార్లు టైటిల్‌ను సాధించింది. ఈ జంటకు 1999 శాన్‌డియాగో ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఏకైకసారి పరాజయం ఎదురైంది.