
లండన్: అమ్మ హోదా వచ్చాక ఆడుతున్న రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్ సెరెనా 3–6, 6–3, 6–4తో కామిలా గియోర్గి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్ కోల్పోయినా... వెంటనే తేరుకొని ప్రత్యర్థి ఆట కట్టించింది. ఏడు ఏస్‌లు సంధించిన ఆమె కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసింది. గ్రాస్‌కోర్టులపై 100వ విజయం సాధించిన 36 ఏళ్ల సెరెనా వింబుల్డన్ టోర్నీలో 11వసారి సెమీఫైనల్‌కు చేరింది. ‘నేను ఏ దశలోనూ మ్యాచ్ ఓడిపోతానని ఆందోళన చెందలేదు.
తొలి సెట్ కోల్పోయినపుడు కూడా నా ప్రత్యర్థి బాగా ఆడుతోందని అనుకున్నాను. చాలా ఏళ్లుగా పరిస్థితులు ఎలా ఉన్నా పోరాటం కొనసాగించడం నాకు అలవాటుగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ అదే చేశాను. నా కూతురికి కూడా ఈ సూత్రం చెప్పాలని అనుకుంటున్నాను’ అని మ్యాచ్ అనంతరం సెరెనా వ్యాఖ్యానించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జర్మనీ ప్లేయర్, 13వ సీడ్ జూలియా జార్జెస్‌తో సెరెనా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో జూలియా 3–6, 7–5, 6–1తో 20వ సీడ్ కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 7–5, 6–4తో సిబుల్కోవా (స్లొవేకియా)పై నెగ్గగా... మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–3, 7–5తో దరియా కసత్‌కినా (రష్యా)పై విజయం సాధించి ఒస్టాపెంకోతో సెమీస్ పోరుకు సిద్ధమైంది.
దివిజ్ శరణ్ జంట ఓటమి
పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శరన్–సితాక్ ద్వయం 6–7 (4/7), 6–7 (5/7), 7–6 (7/3), 4–6తో ఏడో సీడ్ మైక్ బ్రయాన్–జాక్ సోక్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడింది.
నేడు జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో నిషికోరి (జపాన్); రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో డెల్‌పొట్రో (అర్జెంటీనా); అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్); మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో జాన్ ఇస్నెర్ (అమెరికా) తలపడతారు.
►సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment