అయ్యో..ఆఫ్రిది!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో సంచలన ఆటగాడిగా మన్ననలు అందుకున్న షాహిద్ ఆఫ్రిదికి మరోసారి ఆశాభంగం ఎదురైంది. ఇటీవల ఆఫ్రిదికి వీడ్కోలు మ్యాచ్ నిర్ణయాన్నిఉపసంహరించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. తాజాగా ఆ వెటరన్ను ఆటగాళ్ల జాతీయ కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2016-17 కాంట్రాక్ట్ లిస్ట్లో అతని పేరును తొలగించినట్లు ఆఫ్రిదికి క్లియర్ మెస్సేజ్ పంపింది.
గతంలో పాక్ టెస్టు జట్టుతో పాటు, వన్డే జట్టుకు ఆపై టీ 20 జట్టుకు నాయకత్వ బాధ్యతలు వహించిన ఆఫ్రిది.. గత పాక్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో కేటగిరీ-ఏలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఏ కేటగిరిలోనూ స్థానం కల్పించలేదు. టీ 20 వరల్డ్ కప్ అనంతరం తన కెప్టెన్సీకి రాజీనామా చేసిన ఆఫ్రిది.. ఆ తరువాత జట్టులో కూడా స్థానం దక్కించుకోలేకపోయాడు. కాగా, గత కొన్ని రోజుల క్రితం ఆఫ్రిదికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని తొలుత పీసీబీ భావించింది. కాగా, అంతలోనే అతనికి వీడ్కోలు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇంకా క్రికెట్ ఆడాలనే కోరికతో ఉన్న ఆఫ్రిదిని కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించడంతో అతని క్రికెట్ భవిష్యత్ దాదాపు ముగిసిపోయినట్లేనని సంకేతాలను పీసీబీ పంపింది.