
నువ్వు 50 పరుగుల టైప్ ఆలగాడివి కాదు. 200 పరుగులు సాధించే సత్తా ఉన్నోడివి.
కరాచీ: పాకిస్తాన్ వైస్ కెప్టెన్ బాబర్ అజామ్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాలని మాజీ క్రికెట్ షాహిద్ ఆఫ్రిది ఆకాంక్షించాడు. స్థిరంగా ఆడుతున్న అజామ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వెన్నుముఖ లాంటి వాడని ప్రశంసించాడు. సోమవారం కరాచీలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజామ్ 11వ సెంచరీ సాధించి విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. వన్డేల్లో వేగవంతంగా 11వ శతకాన్ని నమోదు చేసిన జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ నేపథ్యంలో అజామ్‌పై వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో ఆఫ్రిది షేర్ చేశాడు. ‘బాబర్ అజామ్ మూడో వన్డేలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నాను. నువ్వు 50 పరుగుల టైప్ ఆటగాడివి కాదు. 100, 150 లేదా 200 పరుగులు సాధించే సత్తా ఉన్నోడివి. టీమ్‌కు నువ్వు వెన్నుముఖ లాంటివాడివి. పాకిస్తాన్ జట్టు తరపున స్థిరంగా రాణిస్తున్న ఆటగాడివి’ అంటూ ఆఫ్రిది పేర్కొన్నాడు.
వన్డేల్లో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు మాత్రమే డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఫఖర్ జమాన్ డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు. ఫామ్‌లో ఉన్న బాబర్ అజామ్ ద్విశతకం బాది జమాన్ సరసన చేరాలని ఆఫ్రిది ఆకాంక్షించాడు. శ్రీలంకతో నేడు జరుగుతున్న మూడో వన్డేలో అజామ్ ఎలా ఆడతాడో చూడాలి. (చదవండి: కోహ్లిని వెనక్కినెట్టేశాడు..)