దుబాయ్: ఇటీవల తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లకు నేతృత్వం వహించిన ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ల డిమాండ్లను ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ అంగీకరించిన నేపథ్యంలో భారత పర్యటనకు ఆ జట్టు రావడం ఖాయమైంది. అయితే షకిబుల్ కావాలనే భారత్ పర్యటనను చెడగొట్టాలని చూస్తున్నాడని బీసీబీ చీఫ్ నజ్ముల్ హసన్ తెలిపారు. బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించి మరీ ఒక స్థానిక టెలికాం సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన షకిబుల్‌ను క్షమించినప్పటికీ భారత పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని నజ్ముల్ అన్నారు. దీనిలో భాగంగా పలువురు క్రికెటర్లను భారత్‌తో సిరీస్‌కు వెళ్లొద్దంటూ కొత్త గేమ్‌ను ఆడుతున్నాడని నజ్ముల్ అన్నారు. దాంతో భారత్ పర్యటనకు బంగ్లా క్రికెటర్లలో అసలు ఎవరొస్తారు అనే దానిపై సందిగ్థత నెలకొంది.
ఇదిలా ఉంచితే, షకిబుల్ మరో ఉచ్చులో చిక్కుకున్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం షకిబుల్‌ను ఒక బుకీ సంప్రదించినా దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. కనీసం ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంభించాడు. ఆపై దీనిపై సమాచారం అందుకున్న బీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్.. షకిబుల్‌తో పాటు సహచర ఆటగాళ్లను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇలా షకిబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అప్పట్లోనే ఐసీసీ సీరియస్ అయ్యింది. ఆపై ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నానని షకిబుల్ చెప్పినప్పటికీ ఐసీసీ మాత్రం అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. దాంతో షకిబుల్‌పై 18 నెలల పాటు నిషేధం విధించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ షకిబుల్‌పై ఐసీసీ తీసుకునే సస్పెన్ష్ వేటు అమల్లోకి వస్తే అతను సుదీర్ఘ కాలం కెరీర్‌ను కోల్పోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment