విరాట్ సేన విధ్వంసం
విరాట్ సేన విధ్వంసం
Published Sun, Jul 24 2016 5:55 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
► తొలిటెస్టులో భారత్ ఆధిపత్యం
► విండీస్ తొలి ఇన్నింగ్స్ 243 ఆలౌట్
► భారత్ 566/8 డిక్లేర్డ్
► రెండో ఇన్నింగ్స్ లో కీలక వికెట్ తీసిన ఇషాంత్
► 302 పరుగులు వెనకబడిన ఆతిథ్య జట్టు
నార్త్ సౌండ్ (అంటిగ్వా) : షమీ (4/66), ఉమేష్ యాదవ్ (4/41) సంచలన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు పట్టు దొరికింది. టీమిండియాను ఎందుకు పిలిపించుకున్నాం అనుకునేలా ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు విరాట్ సేన చుక్కలు చూపిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 243 పరుగులకే చాప చుట్టేసి, ఫాలో ఆన్ ఆడిన విండీస్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 21 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. దాంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో చేసిన 566 పరుగుల భారీ స్కోరు కంటే ఇంకా 302 పరుగులు వెనకబడి ఉంది.
రెండో రోజు (శుక్రవారం) భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 161.5 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టీ తర్వాత కోహ్లిసేన కేవలం 7.5 ఓవర్లు మాత్రమే ఆడింది. ‘సెంచరీ మ్యాన్’ అశ్విన్ తొందరగా అవుటైనా మిశ్రా (68 బంతుల్లో 53; 6 ఫోర్లు)భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో కెరీర్‌లో నాలుగో అర్ధసెంచరీ (67 బంతుల్లో) సాధించాడు. అశ్విన్, మిశ్రా ఏడో వికెట్‌కు 51 పరుగులు సమకూర్చారు. తర్వాత షమీ (17 నాటౌట్) రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడగా, 162వ ఓవర్‌లో మిశ్రా వెనుదిరిగాడు. ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 40 పరుగులు జత చేశారు.
జూలు విదిల్చిన షమీ
చాలాకాలం తర్వాత మళ్లీ టీమిండియాలోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ తన పదునేంటో చూపించాడు. నాలుగు వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. మరో బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా నాలుగు వికెట్లు తీశాడు. మిగిలిన రెండూ అమిత్ మిశ్రా ఖాతాలోకి పడ్డాయి. విండీస్ బ్యాట్స్ మన్ లో బ్రాత్ వైట్, డౌరిచ్ మినహా మిగిలిన ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బ్రాత్ వైట్ 74 పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్ లో వృద్ధిమాన్ కు దొరికిపోయాడు. డౌరిచ్ 57 పరుగులు చేసి చివరివరకు నాటౌట్ గా మిగిలాడు. 243 పరుగులకే ఆలౌటైన ఆతిథ్య జట్టుతో భారత కెప్టెన్ ఫాలో ఆన్ ఆడించాడు.
తొలి ఇన్నింగ్స్ లో వికెట్లేమీ దక్కని ఇషాంత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ హీరో బ్రాత్ ను కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనక్కి పంపాడు. దాంతో ఇక విండీస్ ఆశలు గల్లంతయ్యాయి. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో చేసిన 566 పరుగులు భారీ స్కోరును కనీసం చేరుకోవాలన్నా కూడా ఇంకా 302 పరుగులు చేయాలి. విశ్వరూపం చూపిస్తున్న భారత బౌలర్లను దాటుకుని అంత స్కోరు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో విండీస్ జట్టుకు కష్టమే. దాంతో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప తొలిటెస్టు భారత ఖాతాలో పడటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) కె.బ్రాత్‌వైట్ (బి) గాబ్రియెల్ 7; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) బిషూ 84; పుజారా (సి) కె.బ్రాత్‌వైట్ (బి) బిషూ 16; కోహ్లి (బి) గ్రాబియెల్ 200; రహానే (సి) బ్రేవో (బి) బిషూ 22; అశ్విన్ (సి) గాబ్రియెల్ (బి) కె.బ్రాత్‌వైట్ 113; సాహా (స్టంప్) డోవ్రిచ్ (బి) కె.బ్రాత్‌వైట్ 40; మిశ్రా (సి) హోల్డర్ (బి) కె.బ్రాత్‌వైట్ 53; షమీ నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (161.5 ఓవర్లలో 8 వికెట్లకు) 566 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-14; 2-74; 3-179; 4-236; 5-404; 6-475; 7-526; 8-566.
బౌలింగ్: గాబ్రియెల్ 21-5-65-2; హోల్డర్ 24-4-83-0; సి. బ్రాత్‌వైట్ 25-5-80-0; చేజ్ 34-3-102-0; బిషూ 43-1-163-3; కె. బ్రాత్‌వైట్ 14.5-1-65-3.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: కె.బ్రాత్‌వైట్ (సి) సాహా (బి) యాదవ్ 74; చంద్రిక (సి) సాహా (బి) షమీ 16; బిషూ (స్టంప్డ్) సాహా (బి) మిశ్రా 12; బ్రేవో (సి) సాహా (బి) షమీ 11; శామ్యూల్స్(సి) సాహా (బి) షమీ 1; బ్లాక్‌వుడ్ (సి) రహానే (బి) షమీ 0; ఛేజ్ (సి) కోహ్లీ (బి) యాదవ్ 23; ఎస్ఓ డౌరిచ్ నాటౌట్ 57; జేఓ హోల్డర్ (సి) సాహా (బి) యాదవ్ 36; సిఆర్ బ్రాత్ వైట్ (బి) యాదవ్) 0; ఎస్ టి గాబ్రియెల్ (బి) మిశ్రా) 2, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 90.2 ఓవర్లలో 243 ఆలౌట్
వికెట్ల పతనం: 1-30; 2-68; 3-90; 4-92; 5-92, 6-139, 7-144, 8-213, 9-213, 10-243
బౌలింగ్: ఇషాంత్ 20-7-44-0; ఉమేశ్ 18-8-41-4; షమీ 20-4-66-4; అశ్విన్ 17-5-43-0; మిశ్రా 15.2-4-43-2.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: కె.బ్రాత్‌వైట్ ఎల్బీడబ్ల్యు (బి) శర్మ 2; ఆర్. చంద్రిక నాటౌట్ 9; డీఎం బ్రావో నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం 13 ఓవర్లలో 21/1
బౌలింగ్: ఇషాంత్ 4-2-3-1; షమీ 4-3-2-0; ఉమేశ్ 3-1-8-0; అశ్విన్ 2-0-8-0
Advertisement
Advertisement